“ఆయన వృత్తి యోగా, ప్రవృతి ఆయుర్వేద ఔషదాలను కార్పోరేట్ స్థాయిలో అమ్ముకోవడం…హాబీ రాజకీయ నేతలతో భుజాలు రాసుకొని తిరగడం. ఆయన శీర్ష్యాసనం వేయగలడు…అలాగే ప్రభుత్వాలని కూడా కూల్చగలడు.” ఇది యోగా గురువు బాబా రాందేవ్ గురించి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పుకొంటున్న మాట.
అరుణాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చివేసిన తరువాత, భాజపా దృష్టి కాంగ్రెస్ పాలిత ఉత్తరాఖండ్ రాష్ట్రంపై పడింది. ఆ పనిమీదే దృష్టి పెట్టిన భాజపా అధ్యక్షుడు అమిత్ షాకి ఆ రాష్ట్రంలో ఉంటున్న బాబా రాం దేవ్ యధాశక్తిన సహకరిస్తున్నారని రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు కిషోర్ ఉపాద్యాయ్ ఆరోపించారు. వారిద్దరూ కలిసి తమ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్రలు పన్నుతున్నారని, బాబా రాం దేవ్ యోగా గురువులాగ కాక భాజపా ఏజెంటు లాగ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఏర్పడక మునుపు మార్చి 18న ఆయన తమ పార్టీకి చెందిన 18 ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరిపినట్లు తన వద్ద స్పష్టమయిన ఆధారాలున్నాయని, వాటిని తగిన సమయంలో బయటపెడతానని హెచ్చరించారు.
రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి మథుర దత్త్ జోషి మీడియాతో మాట్లాడుతూ “రాందేవ్ బాబాకి రాష్ట్రంలో రూ.2,000 కోట్లు టర్నోవర్ గల పరిశ్రమలు ఉన్నాయి. వాటిపై అనేక కేసులు వివిధ దశలలో ఉన్నాయి. కనుక సహజంగానే ఆయన మా ప్రభుత్వంపై ప్రతీకారం తీర్చుకొనేందుకు సమయం కోసం వేచి చూస్తున్నారు. ఇప్పుడు భాజపా అధ్యక్షుడు అమిత్ షా తో కలిసి మా ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్రలు పన్నుతున్నారు,” అని ఆరోపించారు.
వారి ఆరోపణలపై బాబా రాం దేవ్ స్పందిస్తూ “నా గురించి మీడియాలో వస్తున్న వార్తలను చూసి నేను చాలా ఆశ్చర్యపోతున్నాను. అసలు రాజకీయాలలోకి నా పేరుని ఎందుకు ఈడుస్తున్నారో అర్ధం కావడం లేదు. రాజకీయ పార్టీల గొడవలు పడుతూ మధ్యలోకి నన్ను అనవసరంగా లాగుతున్నారు. నాకు రాజకీయాలపై ఏమాత్రం ఆసక్తి లేదు. నేను ఏ పని చేసినా బహిరంగంగా అందరికీ తెలిసేలా చేస్తాను. ఒకవేళ నిజంగానే ఎవరినయినా కలాపాలన్నా, విడదీయాలన్నా బహిరంగంగానే చేస్తాను తప్ప రహస్యంగా చేయను. నేను కలలో కూడా ఎన్నడూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని చూసి ఎరుగను. అటువంటిది నేను ఆ పార్టీ ఎమ్మెల్యేలని తిరుగుబాటుకి ప్రోత్సహించానని ఆరోపించడం చాలా విచారకరం. అది నిరాధారమయిన ఆరోపణ,” అని బాబా రాం దేవ్ అన్నారు.
తాటి చెట్టు క్రింద కూర్చొని పాలు త్రాగుతున్నా అందరూ దానిని కల్లే అనుకొంటారు తప్ప పాలని నమ్మరు. అలాగే బాబా రాందేవ్ నిత్యం భాజపా అగ్ర నేతలతో రాసుకుపూసుకు తిరుగుతున్నప్పుడు, ఆయన మీద ఇటువంటి అనుమానాలు కలగడం సహజం. తనకి రాజకీయాల మీద ఏమాత్రం ఆసక్తి లేదని చెపుతున్న ఆయన గత ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీ పెట్టి ఎన్నికలలో దేశవ్యాప్తంగా పోటీ చేస్తామని చెప్పిన సంగతి మరిచిపోయినట్లున్నారు. విదేశాలలో ఉన్న నల్ల ధనాన్ని వెనక్కి రప్పించాలని కోరుతూ కాంగ్రెస్ హయంలో ఆమరణ నిరాహార దీక్ష చేసిన ఆయన ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు..ఎందుకు? ఆయన తరచూ ఏదో ఒక రాజకీయ వ్యాక్యాలు చేయకుండా ఉండలేరు. పైగా రూ. 2,000 కోట్ల టర్నోవర్ ఉన్న వ్యాపారవేత్త బాబా అయినప్పటికీ తప్పనిసరిగా రాజకీయనేతలకి, ముఖ్యంగా అధికార పార్టీ నేతలకి దూరంగా ఎవరూ ఉండలేరు. ఉంటే ఏమవుతుందో కాంగ్రెస్ హయంలోనే రుచి చూసారు. ఉత్తరాఖండ్ సంక్షోభంలో బాబా రాం దేవ్ హస్తం ఉందో లేదో తెలియదు కానీ ఆయన భాజపా ఏజెంటుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు నూటికి నూరు శాతం నిజమని చెప్పకతప్పదు.