138 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి నిధుల సమస్య వెంటాడుతోంది. అత్యధిక కాలం అంటే.. ఆరేడుదశాబ్దాల పాటు కేంద్రంలో ..రాష్ట్రాల్లో చక్రం తిప్పిన ఆ పార్టీకి పట్టుమని ఐదు వందల కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ కూడా లేదు. అదే సమయంలో కార్పొరేట్ విరాళాలు తగ్గిపోయాయి. బీజేపీ వచ్చిన తర్వాత గత పదేళ్ల కాలంలో ఆ పార్టీకి నిర్వహణకు అవసరమైన మొత్తం కూడా సమకూరడంలేదు.
కార్పొరేట్ విరాళాల్లో 90 శాతం బీజేపీకే వెళ్తున్నాయి. బీజేపీకి ఇచ్చే పద్దతి వేరుగా ఉంటుంది. బీజేపీతో కాంగ్రెస్ కు కూడా ఇచ్చే వాతావరణం లేదు. కాంగ్రెస్ కు విరాళం ఇస్తున్నారని తెలిస్తే ఆ కార్పొరేట్ సంస్థలకు గడ్డు పరిస్థితి ఎదురవుతుంది. అందుకే ఎవరూ రిస్క్ తీసుకోవడం లేదు. పైగా బీజేపీ రాగానే ఎలక్టోరల్ బాండ్లను తీసుకు వచ్చింది. ఇది బీజేపీ కోసమే అన్నట్లుగా మారింది. 90 శాతానికిపైగా ఎలక్టోరల్ బాండ్లు బీజేపీ ఖాతాలో పడుతున్నాయి.
కొన్ని ప్రాంతీయ పార్టీల కన్నా ఘోరంగా కాంగ్రెస్ పార్టీకి విరాళాలు తగ్గిపోయాయి. అనేక రాష్ట్రాల్లో అధికారం కూడా లేకపోవడంతో విరాళాలు ఇచ్చే వారూ తగ్గిపోయారు. పార్టీ ఖర్చులు చూసుకునే నేతలు కూడా లేకుండా పోయారు. చివరికి పార్టీకి విరాళాలివ్వాలని ప్రజల్ని కోరుతూ.. ఓ ఉద్యమాన్ని ప్రారంభించింది. 138 రూపాయలు లేదా..1380 లేదా .., 13800 ఎంతైనా ఇవ్వొచ్చని ప్రజల్ని కోరుతోంది.
కాంగ్రెస్ పార్టీకి ఓ రకంగా ఇది ఆర్థిక సమస్యలను కొంతైనా తీర్చే అవకాశం ఉంది. అదే సమయంలో సామాన్యుల నుంచి వచ్చే స్పందనను బట్టి… త మపార్టీకి ఉన్న ఆదరణను అంచనా వేసుకుంటారు. ఈ విధానంపై బీజేపీ విమర్శళు గుప్పించింది. ప్రజల్ని మభ్య పెడుతున్నారని విమర్శిస్తోంది. కానీ ఆ పార్టీ ఖాతాలో ఇప్పటికిప్పుడు నగదు ఐదారు వేల కోట్లు ఉంది. ఆ పార్టీకి హాయిగానే ఉంటుదన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.