త్వరలో రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్టుగా తెలంగాణ జేయేసీ ఛైర్మన్ కె. కోదండరామ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలంగాణ జన సమితి అనే పేరును పరిశీలస్తున్నట్టు సమాచారం. పార్టీకి సంబంధించి విధివిధానాలపై ప్రస్తుతం కసరత్తు చేస్తున్నారు. పార్టీ పెడుతున్నట్టు హడావుడి లేకుండా ప్రకటన చేసినా… పార్టీ తొలి బహిరంగ సభ భారీ ఎత్తున జరిపేందుకు టీజేఎస్ వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఈ సభ వచ్చే నెలలో వరంగల్ లో జరుగుతుందని అంటున్నారు. తొలి సభలోనే పార్టీ విజన్ ఏంటనేది కోదండరామ్ ప్రకటించబోతున్నారు. అయితే, ఇప్పుడీ కొత్త పార్టీ అంశమై కాంగ్రెస్ లో చర్చ జరుగుతున్నట్టు సమాచారం.
వచ్చే ఎన్నికల్లో రైతుల సమస్యల్ని ప్రధాన అజెండా చేసుకుని కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్లబోతున్న సంగతి తెలిసిందే. కేసీఆర్ సర్కారు చేపట్టిన ప్రాజెక్టుల్లోని అవినీతి, రైతులకు ఇచ్చిన హామీలు అమలు, రైతు ఆత్మహత్యలు, గిట్టుబాటు ధరలు ఇలాంటి అంశాలపైనే కాంగ్రెస్ ప్రచారమంతా ఉంటుంది. ఆ పార్టీ త్వరలో చేపట్టబోయే బస్సు యాత్ర కూడా రైతుల సమస్యల అజెండాపైనే ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే, ఇప్పుడు కోదండరామ్ పెట్టబోతున్న కొత్త పార్టీ కూడా రైతులనే లక్ష్యంగా చేసుకుని విధివిధాన ప్రకటనకు సిద్ధమౌతోందట! అంతేకాదు, పార్టీ జెండాలో కూడా రైతు నాగలి ఉండాలనేది కోదండరామ్ ఆలోచనగా ఉన్నట్టు సమాచారం. తెలంగాణ అన్నదాతల సమస్యలకు సంబంధించి ఓ అధ్యయనం చేసేందుకు కూడా కోదండరామ్ సిద్ధమౌతున్నారట. ఇప్పుడీ అంశాలే కాంగ్రెస్ లో ప్రధానంగా చర్చనీయం అవుతున్నట్టు వినిపిస్తోంది.
‘ఆయన పార్టీ పెట్టి… నిరుద్యోగ సమస్యలూ యువతా అంటూ ప్రచారం చేసుకుంటారని అనుకుంటే, రైతు సమస్యలపై ఫోకస్ పెడితే మనకి కాస్త ఇబ్బందే’ అని ఓ ప్రముఖ కాంగ్రెస్ నేత కొందరు సీనియర్ల ముందు వాపోయినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను కోదండరామ్ చీల్చే అవకాశం ఉందనీ, అది కాంగ్రెస్ కు ఇబ్బందికరంగా మారే పరిస్థితిగా ఉంటుందేమో అనేది టి. కాంగ్రెస్ నేతల గుబులు. నిజానికి, కోదండరామ్ పెట్టబోతున్నది కొత్త పార్టీ… విధి విధానాలు ఖరారు కావాలి. క్యాడర్ ఏర్పాటు చేసుకోవాలి. ఎన్నికలకు మహా అయితే ఏడాది మాత్రమే సమయం ఉంది. ఈలోగా టి.జె.ఎస్. ఎంతటి ప్రభావవంతమైన శక్తిగా మారుతుందనేది ఇప్పట్టో చెప్పలేం. కానీ, కాంగ్రెస్ లో మాత్రం ఇప్పట్నుంచే కొంత కలవరం మొదలైపోయినట్టుంది. నిజానికి, కాంగ్రెస్ కు కోదండరామ్ అనుకూలవాది అనే విమర్శలు తెరాస ఎప్పట్నుంచో చేస్తూనే ఉంది. కానీ, ఇప్పుడా కాంగ్రెస్ పార్టీలో ఆ పార్టీపై ఇలాంటి విశ్లేషణలు మొదలయ్యాయట. అయితే, ఎప్పటికైనా ఆయన తమ మిత్రుడే అనేట్టుగా కాంగ్రెస్ నేతలు సంకేతాలు ఇస్తుండటం కూడా ఇక్కడ గమనార్హం.