కాంగ్రెస్ సీడబ్ల్యూసీ సమావేశానికి హైదరాబాద్ వేదిక కాబోతోంది. అగ్రనేతలంతా హైదరాబాద్‌కు రాబోతున్నారు. కాంగ్రెస్ లో నేతల చేరికలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎవరెవరు చేరుతారన్నది మాత్రం ఇంకా సస్పెన్స్ గానే ఉంది. కానీ తన పార్టీని విలీనం చేయడానికి పూర్తి స్థాయిలో రెడీగా ఉన్న షర్మిలకు ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదు. ఇప్పటికే షర్మిల..రాహుల్ గాంధీ, సోనియాలతో భేటీ అయ్యారు. తుది చర్చలు జరుగుతున్నాయని వైఎస్ వర్థంతి సందర్భంగా చెప్పారు. కానీ తర్వాత సైలెంట్ అయ్యారు.
16, 17 తేదీల్లో కాంగ్రెస్ అగ్రనేతలు హైదరాబాద్‌కు వస్తున్నారు. 16న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. ఇక 17న తెలంగాణ విమోచనదినోత్సవం సందర్భంగా భారీ సభ జరగనుంది. 15 సాయంత్రం సోనియా, రాహుల్ హైదరాబాద్‌కు వస్తారు. బహిరంగసభలో కాకుండా వారి సమక్షంలో పార్టీని విలీనం చేయాలని షర్మిల అనుకుంటున్నారు. కానీ ఆమె చేరికపై రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. షర్మిల తెలంగాణ ఎన్నికల బరిలో ఉంటే..ఆంధ్రా పెత్తనం అంటూ బీఆర్ఎస్ నాయకులు ప్రచారం చేసి..కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ చేయవచ్చు అని కాంగ్రెస్ నేతలు కంగారు పడుతున్నారు.
అందుకే ఆమె కాంగ్రెస్ లోకి వద్దని రేవంత్ రెడ్డి హైకమాండ్ పై తీవ్ర స్థాయిలో వత్తిడి తెస్తున్నరని అంటున్నారు. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్‌ని కేవిపి రామచంద్రరావు నడిపిస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు షర్మిల తెలంగాణ రాజకీయాల్లో ఉంటే కాంగ్రెస్‌కు నష్టమని చెబుతున్నారు. ఆమెను పార్టీలో చేర్చుకోవాలనుకున్నా… హైదరాబాద్ లో వద్దని ఢిల్లీలో చేర్చుకుని జాతీయ స్థాయిలో ఏదో ఓ పదవి ఇచ్చినా అభ్యంతరం లేదని.. కానీ తెలంగాణ పార్టీలో మాత్రం షర్మిల వద్దని కాంగ్రెస్ నేతలంటున్నారు. హైకమాండ్ తీసుకునే నిర్ణయమే కీలకం కానుంది.