రెండు ప్లస్ రెండు ఐదు అవుతాయా..?. చాన్సే లేదు. కానీ అయితే అర్థం ఏమిటి…? తప్పు జరిగిందనే కదా..!. తెలంగాణ ఎన్నికల్లోనూ ఇదే జరిగిందని… కాంగ్రెస్ పార్టీ నేతలు గట్టిగానే ఆరోపణలు చేస్తున్నారు. ఈసీ చెప్పిన వివరాలనే .. ఆధారాలుగా చూపిస్తున్నారు. ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఈ వ్యవహారం బయటకు వస్తోంది. ముందుగా చాలా కొద్ది తేడాతో ఓడిపోయిన వారు .. ఈ లెక్కల్ని పట్టుకుని ఈసీ వద్దకు పరుగులు తీస్తున్నారు. మీడియా వద్దకు వస్తున్నారు. న్యాయపోరటానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పోలయిన ఓట్లకు, లెక్కింపు ఓట్లకు ఒక్క ఓటు తేడా వచ్చినా.. కచ్చితంగా ఏదో ఫ్రాడ్ జరిగినట్లే భావించాల్సి ఉంటుందని.. ఎన్నికల నిపుణులు చెప్పే మాట. అందుకే… కాంగ్రెస్ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటోంది.
కోదాడలో పోలయిన ఓట్లు ఈసీ లెక్కల ప్రకారం 1,92,008. కానీ కౌంటింగ్ తర్వాత అభ్యర్థులందరికీ వచ్చిన ఓట్లు కలిపితే 1,93,888గా లెక్క తేలాయి. అంటే.. పోలయిన ఓట్ల కన్నా… 1,880 ఓట్లు ఎక్కువగా వచ్చాయి. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి..? పైగా ఈ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి గెలిచింది.. కేవలం 756 ఓట్ల తేడాతో. ఇదే పరిస్థితి చాలా నియోజకవర్గాల్లో ఉంది. అసిఫాబాద్ నియోజకవర్గంలో పోయింది 1,60,214 . నోటాతో కలిపి అభ్యర్థులందరికీ వచ్చింది 1,60,790 ఓట్లు. అంటే ఎక్కువగా 576 ఓట్లు లెక్కించారు. అలాగే తుంగతుర్తిలో 1057 ఓట్లు, ఇబ్రహీంపట్నంలో 1267 ఓట్లు, తాండూరులో 1067 ఓట్లు, అంబర్ పేటలో 452 ఓట్లు కొల్లాపూర్‌లో 1030 ఓట్లను పోయిన వాటి కన్నా ఎక్కువగా లెక్కించారు. ఈ నియోజకవర్గాలన్నీ… ఎక్కువలెక్కించిన ఓట్లతో ఫలితాలు తారుమారు చేయగలిగినంత చాలా తక్కువ తేడాతో విజేతలు తేలివనే. నిజానికి టీఆర్ఎస్ అత్యంత భారీ తేడాతో గెలిచిన నియోజకవర్గాలు గజ్వేల్, సిరిసిల్లలో కూడా.. పోలయిన ఓట్లకు.. కౌంటింగ్‌లో తేలిన ఓట్లకు పొంతన కుదరలేదు.
చాలా తక్కువ తేడాతో ఓడిపోయిన అభ్యర్థులు తమ దగ్గర ఉన్న ఆధారాలతో కలిసి ఈసీ తలుపు తడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన ఇబ్రహీంపట్నం బీఎస్పీ అభ్యర్థి మల్ రెడ్డి రంగారెడ్డి.. కోర్టుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. గెలిచిన మంచిరెడ్డి కిషన్ రెడ్డి ప్రమాణస్వికారాన్ని ఆపాలని ఆయన ఈసీకి ఫిర్యాదు చేశారు. కౌంటింగ్ అక్రమాలకు సంబంధించి కొన్ని ఆధారాలను ఈసీకి అందించారు. చాలా స్వల్ప తేడాతో ఓడిపోయిన వారు మాత్రమే… పోలింగ్‌కు.. కౌంటింగ్‌కు మధ్య ఓట్ల తేడాను లెక్క చూసుకుని పోరాటానికి సిద్ధమవుతున్నారు. అసలు ఓట్లు ఎక్కడ్నుంచి వచ్చాయో ఆరా తీయాలనుకుంటున్నారు. ఎక్కవ మార్జిన్‌తో ఓడిపోయిన నియోజకవర్గాల్లోనూ… పరిస్థితి ఇలాగే ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీనిపై ఈసీ ఉన్న పళంగా వివరణ ఇవ్వకపోతే.. మరిన్ని విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావొచ్చు.