ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ఉభయసభలలో నోటీసులు ఇచ్చింది. దీనిపై రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ సభ్యులు కెవిపి రామచంద్ర రావు, టి.సుబ్బిరామి రెడ్డి,జెడి. శీలం తదితరులు ఆందోళన చేస్తున్నారు. మాజీ కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ “రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాద్ నగరం తెలంగాణా రాష్ట్రానికి వెళ్లిపోవడంతో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్ధికంగా చాలా ఇబ్బందులు తలెత్తుతాయనే ఉద్దేశ్యంతోనే రాష్ట్ర ఆర్ధికలోటుని భర్తీ చేస్తామని, ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజి, ప్రత్యేక హోదా ఇస్తామని మేము రాజ్యసభలో హామీ ఇచ్చినప్పుడు దానికి ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా అంగీకరించాయి. అప్పుడు మేము ఐదేళ్ళు ప్రత్యేక హోదా ఇస్తామని చెపితే ‘అది సరిపోదు కనీసం పదేళ్ళు ఇవ్వాలని’ వెంకయ్య నాయుడు గట్టిగా కోరారు. ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వమే అధికారంలో ఉంది. కానీ రెండేళ్ళు పూర్తికావస్తున్నా ఇంతవరకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ఆర్ధిక ప్యాకేజి గానీ ఇవ్వలేదు. కనుక ఇప్పటికయినా తక్షణమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో సహా ఆనాడు ఇచ్చిన అన్ని హామీలను తక్షణమే అమలుచేయాలని కోరుతున్నాము,” అని గులాం నబీ ఆజాద్ అన్నారు.
దీనికోసం అవసరమయితే రాజ్యాంగ సవరణ చేయాలని కెవిపి రామచంద్ర రావు కోరారు. విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హామీలను అమలుచేసి ఆదుకోవాలని దిగ్విజయ్ సింగ్ కోరారు. హైదరాబాద్ తెలంగాణా రాష్ట్రానికి వెళ్లిపోవడం వలన ఆదాయం అంతా తెలంగాణాకే వెళ్ళిపోయిందని కనుక తక్షణమే ప్రత్యేక హోదా, ఆర్ధిక ప్యాకేజి తదితర హామీలనన్నిటినీ అమలుచేయాలని కోరారు.
మాజీ కేంద్రమంత్రి డి. పురందేశ్వరి రెండు రోజుల క్రితం మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అంశంపై వివరణ ఇస్తూ రాష్ట్ర విభజన ప్రక్రియ జరుగుతున్న సమయంలో విభజన బిల్లులో ప్రత్యేక హోదా అంశాన్ని కూడా చేర్చాలని రాష్ట్రానికి చెందిన తనతో సహా మరి కొందరు కాంగ్రెస్ ఎంపిలు జైరాం రమేష్ ని కోరినప్పుడు ఆయన ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని తమకు చెప్పారని, ఆ తరువాత తాము దీని గురించే సోనియా, రాహుల్ గాంధిలను కలిసినా వారు కూడా అసలు పట్టించుకోలేదని చెప్పారు.
ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ నేతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ గట్టిగా పట్టుబడుతుండటం విశేషం. ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని వారికి కూడా తెలుసు కనుకనే వారు దాని కోసం పార్లమెంటులో గట్టిగా పట్టుబడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితులు కల్పించాలని ప్రయత్నిస్తున్నట్లున్నారు. ఒకవైపు తమ రాజకీయ ప్రత్యర్ధిని దీనితో ఈవిధంగా ఇబ్బందిపెడుతూనే దీని నుండి కాంగ్రెస్ పార్టీ ఇంకో రాజకీయ ప్రయోజనం కూడా ఆశిస్తున్నట్లుంది.
ప్రత్యేక హోదా కోసం తాము పార్లమెంటులో గట్టిగా పోరాడుతుంటే రాష్ట్రానికి చెందిన తెదేపా, భాజపా సభ్యులు దాని కోసం తమతో కలిసి మోడీ ప్రభుత్వంతో పోరాడేందుకు ముందుకు రావడం లేదని, వారికి రాష్ట్ర ప్రయోజనాల కంటే తమ పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని ప్రజలకు చెప్పుకొనే అవకాశం దక్కుతుంది. అలాగే తెదేపాపై ఒత్తిడి పెంచగలిగితే అది మోడీ ప్రభుత్వంపై విమర్శలు చేయవచ్చును. ఆ కారణంగా రాష్ట్రంలో ఆ రెండు పార్టీల మధ్య స్నేహ సంబంధాలు చెడిపోవచ్చును. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ అవకాశాన్ని వినియోగించుకొని మళ్ళీ బలపడవచ్చును. అంటే ప్రత్యేక హోదా అంశాన్ని కాంగ్రెస్ పార్టీ నేటికీ ఒక రాజకీయ ఆయుధంగానే పరిగణిస్తోంది తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం అది పోరాడటం లేదని స్పష్టం అవుతోంది.