మే 16న తమిళనాడు శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయి. ఆ రాష్ట్రంలో రాజకీయపార్టీలన్నీ ఇప్పటికే దాదాపు ఎన్నికల కోసం పొత్తులు, సమీకరణాల లెక్కలను పూర్తి చేసి ప్రచారానికి సిద్దం అవుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షమయిన డి.ఎం.కె. పార్టీతో కాంగ్రెస్ పార్టీ పొత్తులు ఖరారయ్యాయి కానీ వాటి మధ్య ఇంకా సీట్ల సర్దుబాటు కాలేదు. ఇటువంటి వ్యవహారాలలో ఆరితేరిన సీనియర్ కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ నాలుగయిదు రోజుల క్రితం డి.ఎం.కె. పార్టీ అధినేత కరుణానిధితో సీట్ల పంపకాలపై చర్చలు సాగించారు కానీ ఒక అవగాహనకు రాలేకపోయారు.
కాంగ్రెస్ పార్టీకి కనీసం 65 సీట్లు కేటాయించాలని గులాంనబీ ఆజాద్ కోరారు కానీ అందుకు కరుణానిధి అంగీకరించలేదు. ఈసారి ఎన్నికలలో డి.ఎం.కె. గెలిచి అధికారంలోకి రాలేకపోయినట్లయితే ఇంక రాష్ట్రంలో పార్టీ మనుగడ చాలా కష్టమవవచ్చును.
ఈ ఎన్నికలలో అధికార అన్నాడిఎంకె పార్టీయే గెలిచే అవకాశాలున్నట్లు సర్వే నివేదికలు స్పష్టం చేస్తున్న నేపద్యంలో వీలయినన్ని ఎక్కువ స్థానాల నుంచి పోటీ చేసినట్లయితేనే కనీసం బొటాబొటి మెజార్టీతో గెలిచే అవకాశాలుంటాయని డి.ఎం.కె. భావిస్తోంది. కనుక రాష్ట్రంలో పెద్దగా బలం లేని, గెలిచే అవకాశాలు లేని కాంగ్రెస్ పార్టీకి 65 సీట్లు ఇచ్చేస్తే తమ పార్టీ విజయావకాశాలను ఇంకా కుదించివేసుకొన్నట్లవుతుందనే భయంతోనే కాంగ్రెస్ పార్టీకి అన్నే సీట్లు ఇవ్వడానికి కరుణానిధి భయపడుతున్నారు. కానీ జాతీయపార్టీ అయిన కాంగ్రెస్ పార్టీతో పొత్తుల వలన డి.ఎం.కె.కి ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది కనుకనే దానితో పొత్తులు పెట్టుకొన్నట్లు భావించవలసి ఉంటుంది. కనుక 65 సీట్లు కాకపోయినా, కనీసం 40-50 సీట్లయినా కాంగ్రెస్ కోరవచ్చును. మరి దానికి కరుణానిధి అంగీకరిస్తారో లేదో చూడాలి.
గులాంనబీ ఆజాద్-కరుణానిధి మధ్య ఇవ్వాళ్ళ జరుగబోయే చర్చలలో సీట్ల పంపకాలపై ఒక అవగాహన ఏర్పడవచ్చునని రెండు పార్టీలు నమ్మకంతో ఉన్నాయి. మరికొద్ది సేపటిలో గులాంనబీ ఆజాద్ చెన్నై చేరుకొని కరుణానిధి నివాసంలో మళ్ళీ దీనిపై చర్చలు మొదలుపెడతారు.