కాశ్మీరునుంచి కన్యాకుమారి వరకు విస్తరించి ఉన్న ఏకైకా పార్టీ తమది మాత్రమే అని ఘనంగా చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ వాస్తవంలో ఎంతటి దయనీయమైన గతిలేని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నదో బేరీజు వేయడానికి తమిళనాడులో డీఎంకే తో పొత్తు పెట్టుకుని.. వారు దయపెట్టగా పుచ్చుకున్న సీట్ల సంఖ్యే పెద్ద ఉదాహరణ! 234 సీటుష్ట్ర&్ల ఉన్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయడానికి తమ జాతీయ పార్టీకి కనీసం నాలుగోవంతు సీట్లుకూడా పొందలేని దయనీయస్థితిలోనే కాంగ్రెస్ పార్టీ అక్కడ పోటీకి సిద్ధమవుతోంది. కాంగ్రెస్- డీఎంకేల మధ్య పొత్తు సంగతి చాలా కాలం కిందటే ఖరారైనప్పటికీ.. సీట్ల సంఖ్య తాజాగా మాత్రమే తేలింది. కాంగ్రెస్‌కు 41 సీట్లు మాత్రమే ఇవ్వడానికి డిఎంకే అంగీకరించింది. వారు కేటాయించిన స్థానాల్లో తాము పోటీకి సిద్ధం అంటూ.. కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం తరఫున చెన్నైకు వచ్చి కరుణానిధి మరియు ఆయన వారసులతో మంతనాలు జరిపిన గులాంనబీ ఆజాద్ కూడా ప్రకటించేశారు.
తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ పరిస్థితినిచూస్తే జాలి కలుగుతోంది. 2011లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా డీఎంకే తో పొత్తు పెట్టుకున్న ఆ పార్టీకి అప్పట్లో 63 స్థానాలను కేటాయించారు. రాష్ట్రంలో పతనం అయినప్పటికీ కేంద్రంలో కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వచ్చింది గనుక వారి బంధం కొనసాగింది. కొన్నాళ్లకు తన వారసుల మీద కేంద్రంలో అవినీతి కేసులు పెట్టగానే కరుణానిధి కూటమికి గుడ్‌బై కొట్టారు. బంధం పుటుక్కుమంది. కాంగ్రెస్‌కూడా మిన్నకుండిపోయింది.
ఇప్పుడు తమిళనాడు ఎన్నికల ముంగిట… స్వతంత్రంగా పోటీచేసే దమ్ముల్లేని కాంగ్రెస్ పార్టీ.. పాత అవినీతి ఆరోపణలన్నీ పక్కన పెట్టి తిరిగి డీఎంకేతో పొత్తులకు సిద్దమైపోయింది. ఇదే దిగజారుడుతనం అనుకుంటే.. డీఎంకే కాంగ్రెస్ పార్టీని మరీ తీసికట్టుగా పరిగణించడం విశేషం. బంధం ఖరారైన తర్వాత.. గులాంనబీ ఆజాద్ డీఎంకే తో 65 సీట్లకు బేరం పెట్టారు. కానీ డీఎంకే 30 కి మించి విదిలించేది లేదంటూ పట్టుపట్టింది. నిజానికి ఆరాష్ట్రంలో తమకంటూ చెప్పుకోడానికి కొందరు నాయకులు ఉన్నప్పటికీ.. ఓట్ల పరంగా కాంగ్రెస్‌ది దయనీయమైన పరిస్థితి. అందుకే బేరమాడడం తప్ప వారు చేయగలిగింది ఏమీ లేకుండా పోయింది. బేరాలు పూర్తిచేసి.. చివరికి 41 సీట్ల వద్ద ఆగినట్లుగా కనిపిస్తోంది.
అంతకు మించి గతిర్నాస్తి అన్నట్లుగా.. డీఎంకే కేటాయించిన సీట్లలోనే పోటీచేస్తాం.. అంటూ గులాం నబీ ఆజాద్ మరో దీనాలాపన కూడా వినిపించారు. ఇది కాంగ్రెస్ పతనావస్థకు పరాకాష్ట. ఇలా గతిలేక పెట్టుకున్న పొత్తుల ద్వారా కాంగ్రెస్ పార్టీ తమిళనాడులో ఏం సాధిస్తుందో వేచిచూడాలి.