తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి… వరుసగా వర్కింగ్ ప్రెసిడెంట్లు వచ్చి పడుతున్నారు. కొత్తగా.. మాజీ క్రికెటర్, యూపీ, రాజస్థాన్ల నుంచి రాజకీయాలు చేసిన… అజహరుద్దీన్‌ను.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కిరీటం పెట్టారు. అజహర్‌తో కలిసి.. మొత్తంగా.. ఇప్పుడు టీ పీసీసీకి ఐదుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉన్నారు. మొదట్లో.. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ యూనిట్‌కి అధ్యక్షునిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి… వర్కింగ్ ప్రెసిడెంట్‌గా భట్టి విక్రమార్క మాత్రమే ఉండేవారు. ఎన్నికలకు ముందు కమిటీల నియామకంలో భాగంగా.. ఎన్నికల కమిటీలతో పాటు.. పార్టీ సంస్థాగత పదవులను కూడా భర్తీ చేశారు. టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన తర్వాత చాలా రోజుల వరకూ పదవి లేకుండా ఉన్న… రేవంత్ రెడ్డికి.. ఎన్నికలకు ముందు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇచ్చారు.
రేవంత్ తో పాటు.. పొన్నం ప్రభాకర్‌కూ చాన్సిచ్చారు. అప్పటికే ఉన్న భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌లు వర్కింగ్ ప్రెసిడెంట్లుగా… టీ పీసీసీ ఎన్నికల సమరం ప్రారంభించింది. టిక్కెట్ల పంపిణీ పూర్తయ్యాక.. కమ్మ సామాజికవర్గానికి కాంగ్రెస్ తరపున ఒక్క టిక్కెట్ కూడా దక్కలేదు. దాంతో… జెట్టి కుసుమకుమార్ అనే … పెద్దగా పరిచయం లేని నేతను.. ఆ సామాజికవర్గానికి ప్రతినిధిగా.. భావిస్తూ.. వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ కట్టబెట్టేశారు. ఇప్పుడు పోలింగ్‌కు ముందు.. మైనార్టీ సమీకరణాల్లో తేడా కొట్టిందని అనుకున్నారేమో కానీ.. ఉన్న పళంగా.. అజహరుద్దీన్‌కు కొత్తగా కిరీటం పెట్టారు. మొత్తంగా.. ఒక్క అధ్యక్షునికి.. ఐదుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు తయారయ్యారు.
అజహరుద్దీన్ మూడు, నాలుగు రోజుల నుంచి తెలంగాణలో ప్రచారం చేస్తున్నారు. మైనార్టీలను ఆకట్టుకోవడానికి ఆయనను రంగంలోకి దింపుతున్నారు. ఇదీ కాకుండా.. ఆయన వచ్చే ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. సికింద్రాబాద్ సీటు తనదేనని..మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ గతంలో అజహరుద్దీన్ పేరు ప్రస్తావనకు వచ్చినప్పుడు… గలాటా సృష్టించారు. అయితే ఆయన కుమారునికి ముషీరాబాద్ టిక్కెట్ ఇవ్వడంతో.. ఆయనకు ఇక ఎంపీ టిక్కెట్ ఇచ్చే అవకాశం ఉండకపోవచ్చు. దీంతో అజహర్‌ను ఆయన సొంత రాష్ట్రంలోనే ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ దాదాపు నిర్ణయించేసుకుందని భావించవచ్చు.