వారు ఉమ్మడి రాష్ట్రంలో పిసిసి అద్యక్షులుగా ఒక వెలుగు వెలిగిన ఉద్దండులు. టికెట్ల పంపిణీలోనూ పదవుల పందేరంలోనూ కీలక పాత్ర వహించిన దిగ్గజాలు. ముఖ్యమంత్రుల స్తాయిలో కాకపోయినా గాంధీ భవన్ వరకైనా చక్రం తిప్పిన వారు. కాన ఇప్పుడు వారి పరిస్థితి చూస్తే-?
డి.శ్రీనివాసర్ రెండు సార్లు పిసిసి అద్యక్షులుగా వుండి అధికారంలోకి వచ్చిన క్షణాలలో సంస్థాగత సారథ్యం వహించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాతి స్థానమే అయినా తనకంటూ ఒక విలువుండేది. కాని ఇప్పుడు? టిఆర్ఎస్లో చేరి ఎంపి అయ్యారే తప్ప అప్పటి ప్రాముఖ్యత లేదు. డిల్లీలోనైనా హైదరాబాదులోనైనా అంతే. పైగా ఆయనపై అనేక ఆంక్షలున్నట్టు చెబుతారు. మాట్టాడితే టిఆర్ఎస్ భవన్లోనే. అది కూడా నిర్దేశిత పరిధిలోనే. చాలామంది తన ఇంటర్వ్యూల కోసం వెంటపడుతున్నా ఏమి చెబితే ఏం ముంచుకొస్తుందోనని సందేహం. కుమారుడు రఘు బిజెపిన బలపర్చడం వల్ల మరింత ఇరకాటం. ఏదో భారంగా కాలం గడుపుతున్నారట
కెకెగా పేరొందిన కేశవరావు. తెలుగు ఇంగ్లీషు మేళవించి గడబిడగా గంభీరంగా మాట్లాడే దిట్ట. ఈయనా పిసిసి అద్యక్షులే. అందరికన్నా ముందు టిఆర్ఎస్లో చేరారు. సెక్రటరీ జనరల్ అనీ, పార్లమెంటరీ చైర్మన్ అని ఏవో బిరుదులు తగిలించారు.అంతే. నిర్ణయాధికారం సున్న. ప్రతి సమావేశంలో ముందు అయిదు నిముషాలు మమ అనడం..
మూడో వ్యక్తి బొత్స సత్యనారాయణ. ఉమ్మడి పిసిసి ఆఖరి అద్యక్షుడు. ఆలోచించి ఆలోచించి వైసీపీలో చేరారు.ఘనంగానే తీసుకున్నారు గాని తర్వాత అంతంత మాత్రంగానే నడిచింది. గతంలో పులిలా గర్జించి ముఖ్యమంత్రి పీఠం చేరువలో వున్నట్టు భావించిన సత్తిబాబు ఈయనేనా అని వైసీపీలో చేరిన వారే వాపోయేవారు. అయితే ఆయనమాత్రం పరిస్తితులు మారినప్పుడు సర్దుకోకతప్పదని గ్రహించి సహకరించారు. ఎట్టకేలకు మొన్న వైసీపీప్లీనంలో జగన్ ప్రత్యేకంగా ఆలింగనం చేసుకోవడం ఆయనకు దక్కిన అదనపు గౌరవం. మీడియాతో మాట్టాడ్డంలోనూ కాస్త సాధికారత అధికంగా కల్పించినట్టు కనిపిస్తుంది. అయినా గత వైభవం గురించి అనుకునే పరిస్థితి లేదు.
ఇది అపహాస్యం కాదు. అనుభవం గల నాయకులను సముచిత గౌరవంతో ఉపయోగించుకుంటే పార్టీలకు మేలు తప్ప తక్కువ చేస్తే వారికీ సంస్థకూ కూడా నష్టమే. అయితే ఇందులో స్వయం కృతం ఎంత అని వారు కూడా పరిశీలించుకోవాల్సిందే కదా!