హైదరాబాద్: ఊరందరిదీ ఒకదారి అయితే ఉలిపికట్టెది ఒకదారి అన్నట్లుంది కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎంపీ చింతా మోహన్ వాదన. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కావాలంటూ రాష్ట్రమంతా పార్టీలకతీతంగా గొడవ జరగటం, కొందరు ఆత్మహత్యలు చేసుకోవటం జరుగుతూ ఉంటే తిరుపతికి చెందిన చింతా మోహన్ మాత్రం ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజి కావాలి అంటున్నారు. కొందరు పారిశ్రామిక వేత్తలు ఆదాయపు పన్ను ఎగ్గొట్టేందుకే ప్రత్యేకహోదా కావాలని అడుగుతున్నారని ఆరోపించారు. అందుకే తమకు ప్రత్యేకహోదా వద్దని, ప్యాకేజియే కావాలని అన్నారు. చింతా ఇవాళ తిరుపతిలో కృష్ణదేవరాయ సర్కిల్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాయలసీమకు రు.57 వేల కోట్ల ప్యాకేజి ప్రకటించాలని, చిత్తూరుజిల్లాకు రు.10 వేల కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పారిశ్రామికవేత్తలు ఆదాయపుపన్ను ఎగ్గొట్టేందుకే ప్రత్యేకహోదా అంటున్నారన్న వాదనకూడా నిజమే అయిఉండొచ్చు. చింతా మోహన్ వాదనను పూర్తిగా అసంబద్ధంగా కొట్టిపారేయలేము. దీనిపై కూడా చర్చ జరగాలి.