తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల ప్రకటనకు సిద్ధపడుతున్న సంగతి తెలిసిందే. హైకమాండ్ ఆమోదముద్ర వేయడమే ఆలస్యం… జాబితా ప్రకటన ఉంటుంది. అయితే, ఈలోగా రాష్ట్రంలోని నలుగురు ప్రముఖ నేతలకు కొత్త బాధ్యతలు అప్పగించినట్టుగా తెలుస్తోంది…! జానారెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, విజయశాంతి… వీరితోపాటు మరికొంతమంది నేతలకు రాష్ట్రంలోని కొన్ని జిల్లాలను పార్టీ కేటాయించినట్టు తెలుస్తోంది..! ఒక్కో నేతకీ 10 నుంచి 15 నియోజక వర్గాలను కేటాయించారట. ఇంతకీ, ఈ కేటాయింపులు ఎందుకంటే… బుజ్జగింపు చర్యలు ముమ్మరం చెయ్యడం కోసం.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన వెంటనే ఈ నేతలంతా రంగంలోకి దిగుతారు! ఇప్పటికే పార్టీ నుంచి టిక్కెట్లు ఆశిస్తున్నవారి సంఖ్య గణనీయంగా ఉండటంతో పెద్ద ఎత్తున రెబెల్స్ బెడద ఉంటుందని పార్టీ అంచనా వేసిందని తెలుస్తోంది. పార్టీ చేయించుకున్న అంతర్గత సర్వే ప్రకారం…సీట్లు దక్కకపోతే రెబెల్స్ గా పోటీ చేద్దామని అనుకున్నవారూ, ఇతర పార్టీలోకి జంప్ చేసేందుకు కూడా సిద్ధపడ్డవారు… ఇలాంటివారి జాబితాను పీసీసీ తయారు చేసుకుందని వినిపిస్తోంది. అందుకే, టిక్కెట్లు ప్రకటించిన వెంటనే ఈ రెబల్స్ కు ప్రముఖ నేతలు టచ్ లోకి వెళ్తారు. ఎవరికి కేటాయించిన జిల్లాల్లో వారు పర్యటించి… నేరుగా అసంతృప్త నేతలను కలవడం, లేదా జిల్లా కేంద్రంలో మకాం వేసి, అక్కడికి ఆ నేతల్ని పిలిపించుకుని భేటీ కావడం.. ఇదీ ఈ నేతలకు అప్పగించిన కొత్త బాధ్యతగా తెలుస్తోంది. టిక్కెట్లు రాలేదనీ బాధపడొద్దనీ, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నామినేటెడ్ పదవులలో ప్రాధాన్యత కల్పిస్తామనీ, ఇతర మార్గాల ద్వారా కూడా పార్టీ నుంచి మేలు జరుగుతుందనే బుజ్జగింపులు చేయబోతున్నారు!
ఇంతకీ, రెబెల్స్ విషయంలో కాంగ్రెస్ ఇంత ముందస్తు ప్రణాళికతో ఎందుకు ఉందంటే… కారణం తెరాస! కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని ప్రకటించాక తమ పార్టీలోకి పెద్దగా వలసలు ఉండే విధంగా తెరాస వ్యూహంతో ఉందని అంటున్నారు. అలా చెయ్యడం వల్ల కాంగ్రెస్ ను నైతికంగా కొంత దెబ్బకొట్టినట్టు అవుతుందనే ప్లాన్ ఆ పార్టీది. అందుకే, కాంగ్రెస్ లో ఇంత అప్రకమత్తత కనిపిస్తోంది. అభ్యర్థుల జాబితా ప్రకటించిన తరువాత ఏ ఒక్క నాయకుడూ పార్టీ నుంచి బయటకి వెళ్లకుండా కట్టడి చెయ్యాలన్న ఉద్దేశంతో ఉన్నట్టు తెలుస్తోంది. మరి, ఈ ప్రముఖ నేతల బుజ్జగింపుల పర్వాలు ఎంతవరకూ పార్టీకి లాభిస్తాయో వేచి చూడాలి.