రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతయిపోయింది. ఉన్నంతలో తెలంగాణలో కాస్త ఫర్వాలేదన్నట్టుగా ఉనికి చాటుకుంటోంది. నేతల మధ్య ఆధిపత్య పోరు, గ్రూపులు, కుమ్ములాటలు ఎన్ని ఉన్నా సరే… ఫర్వాలేదు అనే స్థాయిలో తెలంగాణ కాంగ్రెస్ కనిపిస్తోంది. కానీ, ఆంధ్రాలో మాత్రం నానాటికీ పార్టీ పరిస్థితి అధ్వాన్నంగా తయారౌతోంది. వచ్చే ఎన్నికల నాటికి పూర్వవైభవం తీసుకుని రావాలని హైకమాండ్ చాలా వ్యూహాలు రచిస్తున్నా, ఆశించిన ఫలితాలేవీ రావడం లేదు. వాస్తవానికి, ఇప్పుడు ఏపీలో వైకాపాకి ఉన్న ఓటు బ్యాంకు అంతా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీదే అనడంలో సందేహం లేదు. అందుకే, ఏపీలో అధికార పక్షం తెలుగుదేశాన్ని టార్గెట్ చేసుకునే కంటే… విపక్షం వైకాపాపై విమర్శలు పెంచాలనే వ్యూహంతో కాంగ్రెస్ సిద్ధమౌతోందంటూ ఆ మధ్య కొన్ని కథనాలు వచ్చాయి. ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి కూడా అలానే జగన్ పై విమర్శలు చేశారు. గతంలో ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టే, ఆంధ్రాలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టగలిగారు అంటూ ఏదో కొంత హడావుడి చేసే ప్రయత్నం ఆ మధ్య చేశారు.
సరే, నంద్యాల ఉప ఎన్నిక వచ్చింది. దీన్లో పోటీ చేయడం ద్వారా కాంగ్రెస్ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేద్దామని అబ్దుల్ ఖాదర్ ను బరిలోకి దింపారు. కానీ, అక్కడా పరువు పోయింది. కనీసం 1500 ఓట్లు కూడా ఆయనకి రాలేదు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఇంతకంటే ఎక్కువ ఓట్లే వచ్చాయి. దీంతో అక్కడక్కడా మిగులున్న కాంగ్రెస్ నేతలకు కూడా పార్టీపై పూర్తి స్థాయిలో నమ్మకం పోయిందనే చెప్పాలి. దీంతో తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ ఫైర్ అయ్యారు. నంద్యాలలో ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ రఘువీరా తన పదవికి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇంత అధ్వాన్నంగా ఉండటానికి కారణం ఆయనే అన్నట్టుగా విమర్శించారు.
ఇక, గతంలో మన్మోహన్ సింగ్ మంత్రి వర్గంలో కేంద్రమంత్రిగా పనిచేసిన కిల్లి కృపారాణి కాంగ్రెస్ పార్టీకి రామ్ రామ్ చెప్పేయబోతున్నట్టు వినిపిస్తోంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కృపారాణి, ఏపీ కాంగ్రెస్ ప్రముఖుల్లో ఒకరు. ఆమెతోపాటు మాజీ మంత్రి కోండ్రు మురళీ కూడా పార్టీని వదిలేసే ప్రయత్నంలో ఉన్నట్టు కథనాలు వస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ కోలుకుంటుందనే నమ్మకం లేకపోవడంతోనే వీరు ప్రత్యామ్నాయం వెతుక్కుంటున్నారని చెబుతున్నారు. కృపారాణి వైకాపాలో చేరవచ్చనే ప్రచారం జోరుగా జరుగుతోంది. అయితే, వచ్చే ఎన్నికల్లో సీటు విషయమై వైకాపా నాయకత్వం నుంచి ఇంకా స్పష్టత రావాల్సి ఉందనీ, ఆ క్లారిటీ రాగానే ఆమె పార్టీ మారడం ఖాయమని ఏపీ కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈమెతోపాటు రాష్ట్రంలోని మరికొంతమంది కాంగ్రెస్ నేతలు కూడా వైకాపాలో చేరే అవకాశం ఉందని అంటున్నారు. ఏదేమైనా, ఏపీలో కాంగ్రెస్ పై నేతలకే నమ్మకం పోతున్నట్టుగా ఉంది. వందేళ్ల చరిత్ర ఉండి, రాష్ట్రంలో బలమైన మూలాలు ఉన్న పార్టీకి వచ్చే ఎన్నికల్లో అభ్యర్థులు దొరక్కపోయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని చెప్పొచ్చు. మరి, ఈ పరిస్థితిని హైకమాండ్ ఎలా సరిదిద్దుతుందో చూడాలి.