ఆయనేమో నేను ఉండను అంటారు, పార్టీ నాయకులేమో మీరే ఉండాలంటారు. నచ్చజెప్తే విననంటారు, ఆయన పోతానంటున్నాడుగా పోనీ, కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుందామని పార్టీ నాయకులూ అనడం లేదు. ఆయన ఉండనంటున్నా ఆయనే ఉండాలన్నది వీళ్ల పట్టుదల! ఎవరు ఉండమంటున్నా నేను ఉండలేను అంటున్నది ఆయన పట్టుదల. కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ అధ్యక్షుడిగా కొనసాగుతారా లేదా అనే చర్చ ఇలానే కొనసా….గుతూ ఉంది. నిన్నటికి నిన్న మరోసారి పార్టీలోని కీలక నేతలకు యువరాజును మెత్తబెట్టే ప్రయత్నం చేశారు. షీలా దీక్షిత్, జేపీ అగర్వాల్, అజయ్ అగర్వాల్… ఇలా కొంతమంది పెద్దలు రాహుల్ నివాసానికి వెళ్లి, చర్చించి వచ్చారు. చర్చల ఫలితం… యువరాజులవారు ఇంకనూ బెట్టు చేయుచున్నారని మరోపర్యాయం వెల్లడైంది! ఇదే సమయంలో… రాహుల్ గాంధీ నాయకత్వం వర్థిల్లాలి, మీరే మాకు దిక్కు, మీరే మాకు మార్గదర్శకుడు, మీరే లేకపోతే మేం నడవలేం అంటూ పార్టీ యువజన విభాగం ధర్నాకి దిగింది. కాంగ్రెస్ కార్యకర్తలు చాలా చోట నిరసనలు చేయడం మొదలుపెట్టేశారు.
ఇంతకీ, రాహుల్ గాంధీ అధినాయకత్వంపై జరుగుతున్న ఈ చర్చ ఎక్కడ ముగుస్తుంది? ఎలా ముగుస్తుంది… అనేది ఆ పార్టీలో వారికి కూడా క్లారిటీ లేని విషయం. అయితే, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల దృష్ట్యా చూస్తుంటే… ఒక రకమైన క్లైమాక్స్ కనిపిస్తోంది. ఎన్నికల ఫలితాల వెలువడిన దగ్గర్నుంచీ రాహుల్ ని బతిమాలడమే సీనియర్ నేతల పనిగా మారింది. ఇప్పుడు రెండో స్టేజ్.. అంటే, కార్యకర్తలూ అభిమానులూ నిరసనలకు దిగడం, రాహుల్ నాయకత్వం మాకు ఉండి తీరాల్సిందే అనే డిమాండ్ తెరమీదికి తేవడం. ఈ నిరసనల స్థాయి పెరిగిందే అనుకోండి… అప్పుడు రాహుల్ గాంధీ నిమ్మళంగా దిగొచ్చి, అభిమానుల కోరిక మేరకు మేమే అధినాయకులుగా కొనసాగుతామని నిర్ణయించుకోవడం జరిగిందంటూ స్వయం ప్రకటన చేసుకోవడం! అంటే, పార్టీకి నేను తప్పు ఎవ్వరూ దిక్కులేరు అనేది అన్ని స్థాయిల్లో బాగా ఎస్టాబ్లిష్ చేసుకున్నాక… అప్పుడు బాధ్యతలు స్వీకరించడం అన్నమాట. ఇదే జరిగితే ఇంతకన్నా హాస్యాస్పదం మరొకటి ఉండదు.
ఓడిపోయిన వెంటనే పార్టీ పగ్గాలు వదిలేయడం నాయకత్వ లక్షణం అనిపించుకోదు. ఓడినప్పుడు పార్టీని బలమైన నాయకుడు కావాలి. మరో ఐదేళ్లు కష్టపడి పనిచేద్దాం, సంస్థాగత లోపాలపై చర్చించుకుందాం, నా తప్పుల్ని చెప్పండి, ప్రజల తరఫున నిలబడదాం… ఇలాంటి స్ఫూర్తి రాహుల్ అస్సలు లేదు అనేది ఈ ప్రహనం ద్వారా దేశానికి చాటి చెప్పుకున్నారు. ఇంత జరిగాక, తానే మళ్లీ అధినాయకుడిగా కొనసాగాల్సిన పరిస్థితినీ ఓరకంగా ఆయనే సృష్టిస్తున్నారు. ఇది పార్టీకి ఏరకంగారూ శ్రేయస్కరం కాదు. రాహుల్ ఉండనూ అనుకుంటే, మరొకర్ని ఎన్నుకునేంత స్వేచ్ఛ పార్టీకి ఉండాలి. ఒకవేళ అదే ఉంటే, మళ్లీ మళ్లీ రాహుల్ కొనసాగాలీ కొనసాగాలీ అనే డిమాండ్ ఎందుకు ఉత్పన్నం అవుతూ ఉంటుంది..?