కాంగ్రెస్ పార్టీ గత నెల వరకూ తెలంగాణాపై ఆశలు పెట్టుకోలేదు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్లలో విజయం ఖాయమని.. తెలంగాణలో మాత్రం టైట్ ఫైట్ ఉందని అనుకుంది. కానీ ఎన్నికల ఫలితాలు చూస్తే.. ఆ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైంది. కేవలం తెలంగాణలో మాత్రం సాధారణ మెజార్టీ కంటే ఐదు సీట్లు కాస్త ఎక్కువ సాధించింది. ఇది ఒక్కటే ఊరట.
రేవంత్ రెడ్డి లాంటి నేత ఉండటంతో ఇక్కడ విజయం సాధ్యమయింది. లేకపోతే కాంగ్రెస్ పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. మధ్యప్రదేశ్ లో విజయం ఖాయమనిచాలా సర్వేలు చెప్పాయి. కానీ బీజేపీకి ఏకపక్ష మెజార్టీ వచ్చింది. మూడింట రెండు వంతుల మెజార్టీ వచ్చింది. ఇక రాజస్థాన్ లో హోరాహోరీ పోరు ఉంటుందనుకున్నారు. కానీ అలాంటి పరిస్థితి లేదు. ఇక చత్తీస్ ఘడ్ లో విజయం ఖాయమని.. అందరూ అంచనా వేశారు. కనీసం ఒక్క సీటు అయినా ఎక్కువ వస్తుందని మైయాక్సిస్ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. కానీ అక్కడ బీజేపీకి పూర్తి మెజారిటీ వచ్చింది. అంటే కాంగ్రెస్, బీజేపీ ముఖాముఖి తలపడిన స్థానాల్లో బీజేపీ ఏకపక్ష విజయాలు నమోదు చేసింది. తెలంగాణలో బీజేపీ పెద్దగాపోటీ పడలేదు. అయినా కాస్త మెరుగైన ఫలితాల్నే సాధించింది.
దాదాపుగా పది అసెంబ్లీ సీట్లకు అటూ ఇటుగా సాధించింది. మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి హిందీ బెల్ట్ ప్రాంతంలో ఊహించని దెబ్బలు తగిలాయి. అక్కడ బీజేపీ రాజకీయాల్ని అంచనా వేసి కౌంటర్ ఇవ్వడంలో మరోసారి ఫెయిలయ్యారు. ఇది పార్లమెంట్ ఎన్నికల్లోనూ గట్టి ప్రభావం చూపించడం ఖాయంగా కనిపిస్తోంది.