ఆంధ్రప్రదేశ్ లో చావుదెబ్బతిన్న కాంగ్రస్ పార్టీలో చిన్నగా కదలిక మొదలైంది. గాంధీజయంతి అక్టోబరు రెండో తేదీన రాష్ట్రవ్యాప్తంగా ”సత్యాగ్రహం” చేయాలని పార్టీ నిర్ణయించుకుంది.రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని , పోలవరం ప్రాజక్ట్ నిర్మాణాన్ని ఏకబిగిన పూర్తి చేయాలని డిమాండ్లపై ప్రభుత్వం మీద వత్తిడి తీసుకురావడమే సత్యాగ్రహం లక్ష్యమని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కందుల దుర్గేష్ చెప్పారు. రాష్ట్రవ్యాప్త సత్యాగ్రహానికి రాజమండ్రే ప్రధాన వేదిక అవుతోందని అయన అన్నారు. పి.సి.సి అధ్యక్షుడు రఘవీరారెడ్డి, కెవిపి రామచంద్రరావు, ఆనం రామనారాయణ రెడ్డి, కొండ్రు మురళి, శైలజానాధ్, కిల్లి కృపారాణి, పనబాక లక్ష్మీ, చింతా మోహన్ మొదలైన నాయకులు పాల్గొంటారు.రాజమండ్రి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురు సందులో గాంధీ, నెహ్రూ విగ్రహాల వద్ద ఈ సత్యాగ్రహం జరుగుతుంది.
పోలవరం కుడి, ఎడమ కాలువల నిర్మాణం కాంగ్రెస్ హయాంలో జరిగింది.ఇపుడు ఆ కాలువల ద్వారా మోటర్తో నీరు తరలిస్తూ నదుల అనుసంధానమని చంద్రబాబు అభివర్ణించుకోవడం ఒక ప్రగల్భమని శాసనమండలి మాజీ సభ్యుడు కూడా అయిన దుర్గేష్ వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజక్ట్ నిర్మాణానికి రూ. 22 వేల కోట్లు అవసరం ఉండగా కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది కేవలం రూ.350 కోట్లు మాత్రమే కేటాయించింది. ఈ పరిస్థితులలో 2018 నాటికి పోలవరం ప్రాజక్ట్ను పూర్తి చేయడం ఎలా సాధ్యమని కూడా ఆయన ప్రశ్నించారు.
ప్రజలు నడిపించడం, ప్రజల పక్షాన ఉద్యమించడం, పోరాడటం ప్రతిపక్షాల కర్తవ్య బాధ్యతలే. అయితే ఆంధ్రప్రదేశ్ ను ఏకపక్షంగా దుర్మార్గంగా విభజించిన కాంగ్రెస్ పట్ల ప్రజల ఆగ్రహం, అసహ్యం తగ్గలేదు. అయితే ప్రత్యేక హోదా విషయంలో నమ్మకద్రోహంతో బిజెపి పట్లా , అన్ని విషయాల్లోనూ ప్రజల ఆశలను నమ్మశక్యం కాని ఎత్తిుకి పెంచేస్తున్న వైఖరితో తెలుగుదేశం పట్లా ప్రజల్లో అసహనం పెరగుతూండటం కాంగ్రెస్ కి మంచి అవకాశమే! అయితే కాంగ్రెస్ ఈ అవకాశాన్ని కూడా ఎప్పటిలాగే ఏకకాలంలో ఇద్దరిపై యుద్ధం చేయడానికే వాడుకోవాలని భావిస్తోంది. శక్తి, సామర్ధ్యాలు వున్నపుడు చేసే పోరాటాలు వేరు…అయితే మంచం మీద కదలలేని స్ధితిలో చేసే యుద్ధప్రకటనలు పిట్టల దొర వేషంలాగే వినోద భరితాలైపోతాయి. బిజెపి, తెలుగుదేశం పార్టీలు రెండూ కాంగ్రెస్ కి ప్రత్యర్ధులే! అయితే ఏవిషయం మీద ఎవరిని ప్రశ్నించాలి అనే విషయంలో ఫోకస్, ఎత్తుగడా, వ్యూహాలు లేకపోవడమే కాంగ్రెస్ ప్రస్తుత వైఫల్యం.
గాంధీజయంతి నాడు జరిగే కాంగ్రెస్ సత్యాగ్రహం కాని, మరుసటిరోజు నాయకుల పోలవరం ప్రాజెక్టు సందర్శనా, పశ్చిమగోదావరి జిల్లాలో రైతులతో సమావేశాలు కాని ఆపార్టీ చెప్పుకుంటున్నట్టు ప్రభుత్వం మీద వత్తిడి పెంచడానికో, ప్రజల్ని పోరాటాలకు సమాయత్తం చేయడానికో దోహదపడవు. అయితే ఏడాదిన్నరకే ”స్వయంకృత ఆత్మహత్యా యత్నం”నుంచి కోలుకోవాలన్న ఆకాంక్షను ప్రజలకు వెల్లడించడానికి మాత్రం సత్యాగ్రహం కాంగ్రెస్ కి ఉపయోగపడుతుంది.
అవును! మళ్ళీ బతకాలనుకునే ప్రయాణమైనా మొదటి అడుగుతోనే మొదలు కావాలి కదా!!