కొండా సురేఖ విషయంలో ఇక ఎవరు మాట్లాడినా ఊరుకునేది లేదని కాంగ్రెస్ పార్టీ నుంచి టాలీవుడ్‌కు నేరుగా హెచ్చరిక వచ్చేసింది. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రెస్ మీట్ పెట్టి కొండా సురేఖపై ఇక ఒక్క మాట మాట్లాడినా ఆమె ఒంటరి కాదనే సంగతిని గుర్తుంచుకోవాలని సలహా ఇచ్చారు. అది సలహా కాదు.. ప్రభుత్వం తరపున పరోక్షంగా వచ్చిన హెచ్చరిక. కొండా సురేఖ మాటల్ని ఉపంహసించుకున్నానను అని చెప్పిన తర్వాత కూడా టాలీవుడ్ అతిగా స్పందిస్తోందన్న అభిప్రాయంతో కాంగ్రెస్ ఉంది. అందుకే కత్తిరించాలని నిర్ణయించుకుంది.
బీఆర్ఎస్ నేతల మాయలో ఉన్న టాలీవుడ్ .. కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారని అలాంటి వాటిని సహించే ప్రశ్నే లేదని పొన్నం మాటల ద్వారా స్పష్టమవుతోంది. నిజానికి కొండా సురేఖ వివరణ ఇచ్చిన తర్వాత నచ్చినా.. నచ్చకపోయినా ఇక సైలెంట్ కావాలని టీ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ద్వారా సంకేతాలు పంపించారు రేవంత్ రెడ్డి. మహేష్ గౌడ్ చాలా వినమ్రంగా విజ్ఞప్తి చేశారు. కానీ అదే అలుసైపోయినట్లుగా ఉంది. ఇంకా కొంత మంది రెచ్చిపోయారు.
ఈ క్రమంలో నాగార్జునపై కబ్జా కేసు నమోదయింది. ఆ కేసులో డబ్బులు వసూలు చేయాలని పిటిషనర్ పేర్కొన్నారు. ఇంత కాలం ఎన్ కన్వెన్షన్ మీద సంపాదించినదంతా వసూలు చేయాలని ఫిర్యాదు చేసిన వ్యక్తి కోరుతున్నాడు. ఈ కేసు నాగార్జునకు.. టాలీవుడ్‌కు ఓ హెచ్చరిక లాంటిది. ఆ కేసు నమోదైన తర్వాత పొన్నం ప్రెస్ ముందుకు వచ్చి కామెంట్లు చేశారు. ఇప్పటికైనా సూక్ష్మం అర్థం చేసుకుని టాలీవుడ్ సైలెంట్ గా ఉంటుందా లేకపోతే. హీరోయిజం చూపించాలనుకుని.. కాంగ్రెస్ సర్కార్ పై మళ్లీ మళ్లీ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తుందా అన్నది రెండు, మూడు రోజుల్లో క్లారిటీ వస్తుంది.
కొండా సురేఖ విషయంలో కాంగ్రెస్ చాలా స్పష్టత ఉంది. టాలీవుడ్ అతి చేస్తోందని..నాగార్జున విషయంలో ప్రభత్వ పెద్దలకు స్పష్టత ఉందని అంటున్నారు.