తెలంగాణలో రైతు రుణమాఫీ కోసం ముహుర్తం ఫిక్స్ అయ్యింది. గురువారం సాయంత్రం 4గంటలకు రుణమాఫీలో భాగంగా లక్షరూపాయల రుణం వారి ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులు జమ చేయనుంది. ముందుగా మహిళలకు, ఆ తర్వాత పురుషుల పేరుతో ఉన్న అకౌంట్లలో డబ్బు జమకానుంది.
మొత్తం 2లక్షల వరకు రుణమాఫీ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం… మొదట లక్ష రూపాయల రుణాన్ని మాఫీ చేయబోతుంది. ఈ నెలాఖరు వరకు లక్షన్నర రుణం ఉన్న వారివి, ఆగస్టు మొదటి వారం చివరి కల్లా 2లక్షలు మాఫీ చేయబోతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారు.
రుణమాఫీ మొదలు కాగానే… జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికార పార్టీ నేతలంతా… సంబరాల్లో పాల్గొనబోతున్నారు. మాఫీ అయిన రైతులతో సంబరాలు చేసుకోవాలని సీఎం స్వయంగా ప్రకటించారు. అంతేకాదు రుణమాఫీతో ప్రభుత్వానికి విస్తృత ప్రచారం రావాలన్న ఉద్దేశంతో ఇటు పార్టీ పరంగా కూడా కార్యక్రమాలు చేయాలని… తద్వారా పార్టీకి ప్రజల్లో మరింత ఇమేజ్ వచ్చేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అందుకే డీసీసీ ప్రెసిడెంట్లు, ఆఫీస్ బేరర్లతో సీఎం, డిప్యూటీ సీఎంలు భేటీ అయ్యారు.
తెలంగాణలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షం లోక్ సభ ఎన్నికల్లో జీరో అయ్యింది. ఎమ్మెల్యేలు పార్టీ మారిపోతున్నారు. ఈ దశలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీని జీరో చేయటం ద్వారా తమకు ఎదురు లేకుండా చేయాలన్న ఉద్దేశంతో ఉన్నట్లు కనపడుతోంది. ఇటు బీజేపీకి కూడా చెక్ పడుతుందని… అందుకే రుణమాఫీ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అవసరం అయితే గ్రామస్థాయిలో గ్రామ సభలు పెట్టి ధన్యవాదాలు తెలిపేలా కార్యక్రమాలు తీసుకోవాలని పార్టీ ఆదేశించినట్లు తెలుస్తోంది.