ఖమ్మం జిల్లా పాలేరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రామిరెడ్డి వెంకట రెడ్డి మృతి కారణంగా జరుగుతున్న ఉపఎన్నికలలో తెరాస అభ్యర్ధిగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావుని నిలపడంపై కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ రాజకీయ నేత వెంకట రెడ్డి మృతి కారణంగా జరుగుతున్న ఈ ఉపఎన్నికలలో ఆయన భార్య సుచరితా రెడ్డి పోటీ చేస్తున్నప్పుడు, సంప్రదాయాన్ని మన్నించి ఆమె ఏకగ్రీవం ఎన్నికయ్యేందుకు సహకరించకుండా, తెరాస పోటీ చేయాలనుకోవడం అహంకారమేనని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న తెరాసకు ఈ ఉపఎన్నికలలో పాలేరు ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పాలని కోరారు.
ఎవరయినా ఒక ఎమ్మెల్యే చనిపోయినప్పుడు అతని లేదా ఆమె కుటుంబ సభ్యులు పోటీ చేయదలచుకొంటే వారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు అన్ని పార్టీలు సహకరించడం కేవలం ఒక సంప్రదాయమే తప్ప రాజ్యాంగం నియమం కాదు. కనుక ఈ ఉపఎన్నికలలో తెరాస పోటీ చేయాలనుకోవడం ప్రజాస్వామ్యబద్ధమే అవుతుంది తప్ప అహంకారం కాదు. రాజకీయ పార్టీలు క్రమేణా తమ నైతిక విలువలను దిగజార్చుకొంటున్నప్పుడు ఇటువంటి ఆలోచనలను, పరిణామాలను కూడా అంగీకరించడం నేర్చుకోవలసి ఉంటుంది.
ఈ ఉపఎన్నికలలో సానుభూతి ఓటు కాంగ్రెస్ పార్టీకి సానుకూల అంశంగా ఉంటుంది కనుక దానిని వినియోగించుకొని ఈ సీటుని మళ్ళీ దక్కించుకోగలిగినట్లయితే అధిష్టానం ముందు మెప్పు పొందవచ్చు అలాగే రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ హవా మొదలయిందని గొప్పలు చెప్పుకోవచ్చు. అందుకే అంత తహతహలాడుతోంది కానీ విజయపడంలో దూసులుపోతున్న తెరాసను డ్డీకొని గెలవగలమోలేదోననే భయం కూడా ఉన్నందునే అన్ని పార్టీల మద్దతు కోరుతోంది. నిజానికి ఈ ఉపఎన్నికలలో తెరాస పోటీ చేయకూడదు అని కోరుకొనే బదులు, దానిని డ్డీ కొని గెలిచి చూపిస్తే కాంగ్రెస్ పార్టీ బలం అందరికీ చాటుకొనే అవకాశం ఉంటుంది. అందుకోసం కాంగ్రెస్ పార్టీ సానుభూతి ఓట్లను పిండుకొని, ప్రతిపక్ష పార్టీల మద్దతు స్వీకరించినా పరువాలేదు కానీ గెలిచి చూపించాలి. గాలికి పోయే పేలాలు కృష్ణార్పణం అన్నట్లుగా ఈ ఉపఎన్నికలలో వైకాపా పోటీ చేసినా ఎలాగు గెలవలేమని గ్రహించడంతో తెలివిగా నైతిక విలువలను పాటిస్తూ కాంగ్రెస్ అభ్యర్ధికి పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించేసింది. మరి తెదేపా కూడా ఆ పేలాల ఆప్షన్ ఉపయోగించుకొంటే సేఫ్ గా ఎస్కేప్ అయిపోవచ్చు లేకుంటే ఈసారి ఓడిపోతే దానికి తెలంగాణాలో ప్రజలు మంగళహారతి ఇచ్చేసారని ప్రచారం మొదలవవచ్చు.