వాళ్ల వల్ల కాంగ్రెస్కు ఒక్క ఓటు అదనంగా వస్తుందన్న గ్యారంటీ ఉండదు కానీ.. చిచ్చు పెట్టి మొత్తం రచ్చ చేసేయడంలో మాత్రం ముందు ఉంటారు. మాట్లాడితే పార్టీ గెలవాలంటారు కానీ.. ఆ పార్టీని అందరి ముందు చులకన చేయడంలోనూ వారే ముందు ఉంటారు. టీ కాంగ్రెస్లో ఆ ఇద్దరు జగ్గారెడ్డి, వీహెచ్. బీజేపీని ప్రధాన ప్రత్యర్థిగా చూపించి.. కాంగ్రెస్ ను దెబ్బకొట్టడానికి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్లాన్ చేసుకుంటున్నారు. దాని ప్రకారమే జరుగుతున్నాయి. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న సమయంలో యశ్వంత్ సిన్హాను పిలిపించి హడావుడి చేయడానికి కూడా అదే కారణం. ఈ విషయం తెలియడానికి రాజకీయాల్లో డాక్టరేట్లు చేయాల్సిన అవసరం లేదు.
అయినా కాంగ్రెస్ పార్టీ నుంచి వీహెచ్ ఆయనకు స్వాగతం చెప్పడానికి టీఆర్ఎస్ నేతలతో కలిసి ఎయిర్పోర్టుకెళ్లారు. తర్వాత జగ్గారెడ్డి సీన్ లోకి వచ్చి మిగతా వాళ్లు ఎందుకెళ్లలేదని రచ్చ చేసేశారు. ఓ వైపు బీజేపీ , టీఆర్ఎస్ పోట్లాడుకుంటున్నట్లుగా కలర్ ఇస్తూంటే.. కాంగ్రెస్ నేతలు మాత్రం తమలో తాము పొట్లాడుకుంటూ పార్టీని నవ్వుల పాలు చేసేందుకు తమ వంతు ప్రయత్నం చేశారు. ఇలాంటినేతలు ఉన్నంత కాలం రేవంత్ కాదు కదా.. ఇంకెవరు వచ్చినా కాంగ్రెస్ పార్టీని బాగు చేయలేరనే ఓ నిర్వేదం కాంగ్రెస్ పార్టీలో నిన్నటి పరిణామాలతో ఏర్పడిపోయింది.
వీహెచ్ కి కనీసం పట్టు మని పది మంది కార్యకర్తలు లేరు. జగ్గారెడ్డి పార్టీని నాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా ఆయన ప్రవర్తన ఉంటోంది. ఎన్ని సార్లు హెచ్చరికలు జారీ చేసిన ఆయన తీరు మారదు. టీఆర్ఎస్ పిలుచుకొచ్చిన యశ్వంత్ సిన్హాను తాము కలిసి మద్దతు ప్రకటించడం ఏమిటనే చిన్న ఆత్మగౌరవం అయినా ఉంచుకోవాల్సిన నేతలు.. సొంత నేతలపై కుట్రలు చేసుకోవడానికి ఏ మాత్రం తగ్గలేదు. అందుకే ఈ ఇద్దర్నీ పార్టీ నుంచి తొలగిస్తే తప్ప… ఆ పార్టీ ఈ అవలక్షణాలను వదిలించుకోలేదని కార్యకర్తలు కూడా తేల్చేస్తున్నారు.