సరిగ్గా వరంగల్ ఉప ఎన్నికల ముందు కాంగ్రెస్ అభ్యర్ధిగా ఎంపిక అయిన సిరిసిల్ల రాజయ్య ఇంట్లో జరిగిన ఘోర దుర్ఘటనతో ఇక కాంగ్రెస్ పని అయిపోయినట్లేనని చాల మంది భావించారు. కానీ ఎవరూ ఊహించని విధంగా తెలంగాణా కాంగ్రెస్ నేతలందరూ కలిసికట్టుగా పోరాటం చేస్తూ, తాము తలుచుకొని గట్టిగా ఒక పట్టుబడితే అది ఎలా ఉంటుందో అధికార తెరాసకి ఇప్పుడు రుచి చూపిస్తున్నారు. కేవలం వారం పది రోజుల వ్యవధిలోనే కాంగ్రెస్ పూర్తిగా కోలుకోవడమే కాకుండా ఈ ఎన్నికలలో తెరాసకు గట్టి సవాలు విసురుతోంది.
తెరాసలో కేవలం కేసీఆర్ కుటుంబ సభ్యులు కాక మరో 3-4మంది నేతలు మాత్రమే ఎటువంటి ప్రశ్నలకయినా చాలా అలవోకగా జవాబులు చెప్పగలరు. కానీ కాంగ్రెస్ పార్టీలో అటువంటి నేతలు చాలా మంది ఉన్నారు. వాళ్ళు చాలా మంచి ప్రశ్నలు వేయగలరు అలాగే ప్రత్యర్ధి పార్టీల సవాళ్ళకు చాలా ధీటుగా జవాబులు కూడా చెప్పగలరు. ప్రస్తుతం ఆ దేశముదురు కాంగ్రెస్ నేతలు విసురుతున్న సవాళ్ళకు తెరాస నేతలు జవాబులు చెప్పలేక సతమతమవుతున్నారు.
కేవలం తను చేసిన ఉద్యమాలు, ఆమరణ నిరాహార దీక్ష వల్లనే తెలంగాణా వచ్చిందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంతవరకు గొప్పగా చెప్పుకొనేవారు. కానీ కాంగ్రెస్ అభ్యర్ధి సర్వే సత్యనారాయణ, పొన్నం ప్రభాకర్, జైపాల్ రెడ్డి తదితరులు, కేసీఆర్ గట్టిగా రెండు రోజులు కూడా నిరాహార దీక్ష చేయలేదని, కానీ ఆ విషయం గురించి అప్పుడు మాట్లాడితే తెలంగాణా సాధనకి అవరోధంగా మారుతుందనే ఉద్దేశ్యంతోనే తామంతా మౌనం వహించామని ఈ ఎన్నికల సమయంలో చెపుతున్నారు. అలాగే తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కేసీఆర్ ని, తెరాసని పక్కనపెట్టి తెలంగాణా ఏర్పాటు గురించి తమతో సమాలోచనలు చేయడం, అప్పుడు కేసీఆర్ తమపై ఆగ్రహం వ్యక్తం చేయడం వంటి గత చరిత్రనంతా తవ్వి పోస్తూ, తెలంగాణా సాధనలో కేసీఆర్ కంటే తామే ఎక్కువగా కృషి చేసామని చాలా సమర్ధంగా వాదిస్తూ తెరాస నేతలకు నోట మాట రాకుండా చేయగలుగుతున్నారు.
కాంగ్రెస్ ఎమ్.పి.లు పాల్వాయి గోవర్దనరెడ్డి గుత్తా సుఖేందర్ రెడ్డి మరో రకమయిన ఆరోపణలు చేస్తున్నారు. కేసీఆర్ తన కూమార్తె కవితకు కేంద్ర మంత్రి పదవి ఇప్పించుకోవడం కోసమే కేంద్రప్రభుత్వం తెలంగాణాకు ఎంత అన్యాయం చేస్తున్నా నోరు మెదపడం లేదని ఆరోపించారు. అలాగే కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు పాల్పడిన అవకతవకలపై సిబీఐ విచారణ మొదలవడంతో ఆయన ప్రధాని నరేంద్ర మోడిని మంచి చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని, అందుకే ఈ ఉప ఎన్నికలలో ఆయన బీజేపీకి లోపాయికారిగా సహకారం అందిస్తున్నారని ఆరోపించారు. తెదేపా ప్రత్యక్షంగా బీజేపీకి మద్దతు ఇస్తుంటే తెరాస పరోక్షంగా మద్దతు ఇస్తోందని ఆరోపించారు. ఈ ఎన్నికల తరువాత తెరాస కూడా ఎన్డీయే కూటమిలో చేరడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.
ప్రధాని నరేంద్ర మోడిని మంచి చేసుకోనేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ పనిగట్టుకొని అమరావతి వెళ్ళారని గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. వారి ఆరోపణలలో, విమర్శలలో నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ, వాటిని తెరాస నేతలు సమర్ధంగా తిప్పికొట్టలేకపోవడం చాలా స్పష్టంగా కనబడుతోంది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే కాంగ్రెస్ నేతలు అందరూ కూడబలుకొన్నట్లు ముందుకు వచ్చి పోరాడుతూ, ఉప ఎన్నికల తీరు తెన్నులు మార్చివేయడం మెచ్చుకోవలసిందే. కాంగ్రెస్ నేతలు అందరూ చాలా అద్భుతమయిన పోరాటపటిమ ప్రదర్శిస్తున్నారు. ఇదే ఐకమత్యం, పోరాటపటిమను వారు నిరుడు జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ప్రదర్శించి ఉండి ఉంటే, ఇప్పుడు వారి పార్టీయే అధికారంలో ఉండి ఉండేది. కానీ చాలా ఆలస్యంగా మేల్కొన్నారు.