హైదరాబాద్: ఇంకో తెలుగు న్యూస్ ఛానలా అని కంగారుపడకండి! ఇది ప్రాంతీయ ఛానల్ కాదు, జాతీయ ఛానల్. 2014 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ తీవ్ర పరాజయానికి ప్రధాన కారణాలలో సమాచారలోపంకూడా ఒకటని అభిప్రాయపడుతున్న పార్టీ నాయకత్వం ఆ లోటును పూడ్చటానికి జాతీయస్థాయిలో త్వరలో ఒక సొంత న్యూస్ ఛానల్ ప్రారంభించాలని నిర్ణయించింది. కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోని ఈ విషయాన్ని నిన్న ధృవీకరించారు. కొత్త తరం సమాచార వ్యవస్థలను పార్టీ సమర్థవంతంగా వినియోగించుకోలేకపోతోందని అందరూ అభిప్రాయపడుతున్నారని, దీనిని పార్టీ సీరియస్‌గా పరిశీలిస్తోందని ఆంటోని చెప్పారు. తమ పార్టీ విధానాలను ప్రజలలోకి బాగా తీసుకెళ్ళటానికి టీవీ మాధ్యమాన్ని వాడుకోవాలనుకుంటున్నామని తెలిపారు.
మరోవైపు, కేరళలో పార్టీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న జైహింద్ న్యూస్ ఛానల్ విజయవంతమవటంతో అదే ప్రయోగాన్ని జాతీయస్థాయిలో చేయటమో, లేక అదే ఛానల్‌ను జాతీయ ఛానల్‌గా మార్చటమో చేయాలని పార్టీ నాయకత్వం ఆలోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై ప్రాజెక్ట్ రిపోర్ట్ రూపొందించాలని కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ, పీసీసీ మాజీ అధ్యక్షుడు రమేష్ చెన్నితాలను పార్టీ అధినేత్రి సోనియాగాంధి ఆదేశించారని తెలిసింది.