జూర్జిబుష్ జూనియర్ మొదటి సారి అమెరికా అధ్యక్షుడైనప్పుడు… ఆయనకు ఓట్లు తక్కువొచ్చాయి. కానీ అధ్యక్షునిగా ఎన్నికయ్యేందుకు కావాల్సిన ఎలక్టోరల్ ఓట్లు మాత్రం ఎక్కువొచ్చాయి. దాంతో ఆయన అధ్యక్షుడయ్యారు. నిన్నగాక మొన్న డొనాల్డ్ ట్రంప్ కూడా.. ఓట్లు తక్కువొచ్చినా…. ఎలక్టోరల్ ఓట్లు ఎక్కువ తెచ్చుకుని అధ్యక్షుడయ్యారు. అమెరికాకు ప్రెసిడెంట్ అయిన మహిళగా హిల్లరీ క్లింటన్ ఉండాలని చాలా మెజార్టీ ప్రజలు ఆశించినా.. అమెరికా రాజ్యాంగం ప్రకారం..ఓడిపోక తప్పలేదు. దీనిపై అమెరికాలో విస్త్రత చర్చ జరుగుతోంది. కానీ… ఏమైనా మార్పులుచేర్పులు చేయాలనే స్థాయిలో జరగడం లేదు.
ఇప్పుడు ఇదే పరిస్థితి భారతదేశంలోనూ కనిపిస్తోంది. స్వతంత్ర భారతదేశ చరిత్రలో తొలిసారి ఓట్ల శాతం ఎక్కువగా ఉండి.. ఓడిపోయిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ నిలిచింది. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వాస్తవంగా ప్రజాభిమానం పొందింది. ఆ పార్టీకి 38 శాతం ఓట్లు వచ్చాయి. కానీ సీట్లు మాత్రం 78 దగ్గరే ఆగిపోయాయి. భారతీయ జనతాపార్టీకి కాంగ్రెస్ పార్టీ కన్నా దాదాపుగా 2 శాతం ఓట్లు తక్కువొచ్చాయి. కానీ సీట్లు మాత్రం ఏకంగా ఇరవై ఆరు ఎక్కువొచ్చాయి. ఇది సామాన్యమైన విషయం కాదు. ఇంత వరకూ ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా.. గెలిచిన పార్టీకే అంతో ఇంతో ఓట్ల ఆధిక్యం కనిపించేది కానీ.. తొలి సారి కర్ణాటకలో రెండు శాతం ఓట్ల తేడాతో.. అదీ తక్కువ వచ్చిన పార్టీ… అధికారానికి దగ్గరగా నిలుచుంది. పూర్తి స్థాయి మెజార్టీ సంగతి పక్కన పెడితే.. ఓట్లు తగ్గిపోయినా.. సీట్లు రావడం అనేది అనూహ్య పరిణామం.
నిజానికి భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రధానంగా మెజార్టీ మీద ఆధారపడి ఉంది. వంద ఓట్లలో ఎవరికి ఎక్కువ వస్తే వారే గెలిచినట్లు. అంటే… లెక్కల ప్రకారం..దేశంలో ఉన్నవారిలో ఎక్కువ మంది ఎవర్ని కోరుకుంటే వారే విజేత. కానీ మన దేశంలో అధ్యక్ష తరహా వ్యవస్థ లేదు కాబట్టి… లోక్ సభ, అసెంబ్లీ సీట్ల వరకే అది పరిమితమైంది. కానీ ఓవరాల్గా లెక్కలేసినప్పుడు.. తేడా ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. ఇదే మొదటి సారి కాబట్టి విచిత్రంగా అనిపించవచ్చు. కానీ… ఫలితాలు ప్రజాభిప్రాయానికి అనుగుణంగా లేవని భావించినప్పుడు ప్రజల్లో.. అసంతృప్తి ప్రారంభమవుతుంది. అది అలజడికి కారణమవుతుంది. అలాంటి పరిస్థితి రాకుండా.. ఇప్పుడు ప్రభుత్వాలు, మేథావులు, ప్రజల్లో చర్చలు ప్రారంభం కావాలి. అనువైన పరిష్కారం కనుగొనాల్సి ఉంది.