ఆమాద్మీ పార్టీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్ధిగా పంజాబ్ ఎన్నికలలో పోటీచేసే అవకాశం కనిపించడంతో నవజ్యోత్ సింగ్ సిద్ధూ భాజపాని, అదిచ్చిన రాజ్యసభ సీటుని కూడా వదులుకొని బయటకి వచ్చేశాడు. ఇదివరకు నవజ్యోత్ సింగ్ సిద్ధూ భాజపాలో ఉన్నప్పుడు అరవింద్ కేజ్రీవాల్ పై చాలా ఘాటుగా విమర్శలు చేశారు. అందుకు ఆయన ఇప్పుడు సిద్ధూ మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకొన్నారో లేదా సిద్ధూ వంటి ప్రజాకర్షణ గల క్రికెటర్ భాజపాలో ఉంటే పంజాబ్ ఎన్నికలలో తమ పార్టీకి పెద్ద సవాలుగా నిలుస్తాడని భావించారో గానీ, సిద్దూని భాజపాలో నుంచి బయటకి రప్పించి హ్యాండ్ ఇచ్చేశారని మీడియాలో తెగ ఊహాగానాలు వస్తున్నాయి. అతను కోరినట్లుగా ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించడం, అతని భార్యకి కూడా టికెట్ కేటాయించలేమని అరవింద్ కేజ్రీవాల్ తేల్చి చెప్పేసినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనకి మంచి బంపర్ ఆఫర్ వచ్చినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. సిద్దూకి, అతని భార్యకి కూడా టికెట్స్ ఇవ్వడానికి తమకేమీ అభ్యంతరం లేదని, వారిద్దరూ కాంగ్రెస్ పార్టీలో రాదలచుకొంటే సాదరంగా ఆహ్వానిస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పినట్లు సమాచారం. అయితే సిద్ధూ కోరినట్లుగా ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించలేమని కానీ కాంగ్రెస్ పార్టీ పంజాబ్ లో అధికారంలో వస్తే సిద్ధూకి ఉప ముఖ్యమంత్రి పదవి లేదా మరో ముఖ్యమైన పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఆ వార్తలని చూసి అరవింద్ కేజ్రీవాల్ అప్రమత్తం అయ్యారు. సిద్దూ చేరికపై మీడియాలో వస్తున్న వార్తలపై స్పందిస్తూ ఈవిధంగా ట్విట్ మెసేజ్ పెట్టారు. “ఆయన మా పార్టీలో చేరుతుండటంపై మీడియాలో చాలా వదంతులు వస్తున్నాయి. కనుక ఈ అంశంపై వివరణ ఇవ్వడం నా బాధ్యత అని నేను భావిస్తున్నాను. గతవారం మేము కలిసిన మాట వాస్తవం. ఆయనకి నేను ఎటువంటి ముందస్తు షరతులు పెట్టలేదు. తన నిర్ణయం చెప్పడానికి ఆయన మరికొంత సమయం కావాలని కోరారు. అందుకు సరేనన్నాను. ఆయన ఒక గొప్ప వ్యక్తి, క్రికెట్ లెజెండ్ కూడా. ఆయన మా పార్టీలో చేరినా చేరకపోయినా ఆయన పట్ల నాకు ఎప్పటికీ గౌరవం ఉంటుంది,” అని అరవింద్ కేజ్రీవాల్ మేసెజ్ పెట్టారు.
కనుక సిద్దూకి ఆమాద్మీ పార్టీ తలుపులు ఇంకా మూసుకుపోలేదని స్పష్టం అవుతోంది. కానీ అమాద్మీ పార్టీ సిద్దాంతం ప్రకారం ఒకే కుటుంబానికి రెండు టికెట్స్ కేటాయించడానికి కూడా వీలులేదు. అలాగే సిద్దూని ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించడానికి అరవింద్ కేజ్రీవాల్ అంగీకరించడం లేదనే వార్తలు నిజమనుకొంటే, అప్పుడు సిద్దూ ఆమాద్మీలో చేరడానికి బలమైన కారణాలు ఏవీ ఉండవు. రెండు టికెట్స్+మంత్రి పదవి ఆఫర్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. బంతి ఇప్పుడు సిద్ధూ చేతిలోనే ఉంది. కనుక ఆయన ఆమాద్మీ పార్టీలో చేరుతారా లేకపోతే కాంగ్రెస్ చేరుతారో చూడాలి. ఇంకా ఆలస్యం చేస్తే ఏదైనా జరుగవచ్చు కనుక నేడోరేపో ఏదో ఒక పార్టీలో చేరి సిద్దూ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టవచ్చు. భాజపా నుంచి తొందరపడి బయటకి వచ్చిన తరువాత కూడా సిద్దూకి ఈవిధంగా రెండో చాన్స్ దక్కడం విశేషమే.