అసెంబ్లీలో పాసయిన బిల్లులన్నీ మండలిలో పాస్ కావాలి.. అలా పాస్ కావాలంటే మండలిలో మెజార్టీ ఉండాలి. కానీ తెలంగాణ శాసనమండలిలో కాంగ్రెస్ ఉన్నది ఒకే ఒక్క సభ్యుడు. మొత్తం సభ్యులు 40 మంది. ఇక్కడే రేవంత్ కు అసలు చిక్కులు ప్రారంబంకానున్నాయి. ప్రస్తుతం గవర్నర్ నామినేటెడ్ కోటాలో రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రంలో తాజాగా జరిగిన శాసనసభ ఎన్నికల్లో నలుగురు ఎమ్మెల్సీలు పోటీచేసి గెలుపొందారు. ఎమ్మెల్యేగా ప్రమాణం చేయడానికి ముందే శాసన మండలి మండలి సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది.
వీరిలో బీఆర్ఎస్ నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలైన కడియం శ్రీహరి , పాడి కౌశిక్ రెడ్డి , పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉన్నారు. ఇక స్థానిక సంస్థల కోటా సభ్యుడు కసిరెడ్డి నారాయణ రెడ్డి ఉన్నారు. మండలిలో బీఆర్ఎస్కు పూర్తి అధిక్యం ఉంది. బీఆర్ఎస్కు 28 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. కాంగ్రెస్ తెచ్చే బిల్లులు ఆపాలనుకుంటే పెద్ద కష్టం కాదు. ఈ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్సీల రాజీనామాలతో ఉప ఎన్నికలు వస్తే తప్ప 2025 వరకు ఇతర ఎమ్మెల్సీలు ఖాళీ అయ్యే అవకాశం కూడా లేదు. కానీ రెండు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలు మాత్రం ఖాళీగా ఉన్నాయి. గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న రెండు స్థానాలను మాత్రం త్వరలోనే భర్తీ చేసుకునే అవకాశం ఉంది. వీరితో కలిస్తే కేవలం ముగ్గురు మాత్రమే తెలంగాణ శాసనమండలిలో కాంగ్రెస్ సభ్యులు ఉంటారు. శాసనమండలి కాంగ్రెస్ పార్టీకి సవాల్ గా మారనుంది.
ఏపీలో వైసీపీకి ఇలాంటి పరిస్థితే వచ్చింది. అందుకే వారు కీలకమైన రాజధాని బిల్లును పాస్ చేసుకోలేకపోయారు. ఇప్పుడు అలాంటి వివాదస్పదమైనబిల్లులు కాంగ్రెస్ ప్రవేశ పెట్టదు కానీ.. చికాకు పెట్టాలనుకుంటే.. ఏమైనా చేయవచ్చని.. ఎలాంటి బిల్లులు అయినా ఆపడానికి ప్రయత్నించవచ్చని భావిస్తున్నారు. రేవంత్ తన పవర్ ను ఉపయోగించుకుని ఎమ్మెల్సీలని ఆకర్షించడమే మిగిలిందని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.