అనుకున్నట్టుగా డ్రగ్స్ కేసు రాజకీయ రంగు అద్దేస్తున్నాయి అధికార ప్రతిపక్షాలు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ట్వీట్ చేయడంతో డ్రగ్స్ కేసుపై రాజకీయ రచ్చ మొదలైంది. అధికార పార్టీ వారసుడి సన్నిహితులు ఉన్నారంటూ మంత్రి కేటీఆర్ ను లాగే ప్రయత్నం చేశారు డిగ్గీరాజా. దానికి కౌంటర్ గా కేటీఆర్ కూడా ఘాటుగానే స్పందించారు. ఇంకేముంది… కాంగ్రెస్ నేతలందరూ వరుసగా విమర్శలు చేస్తూ మీడియా మైకుల ముందు క్యూలు కట్టేస్తున్నారు. కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ మాట్లాడుతూ… కేసీఆర్ హయాంలో గడచిన మూడు సంవత్సరాల్లో చాలా స్కాములు జరిగాయని ఆరోపించారు. ప్రతీసారీ ఆయా స్కాములపై తండ్రీ కొడుకులు పెద్ద హైప్ క్రియేట్ చేస్తారనీ, తరువాత ఫైల్ క్లోజ్ చేసేస్తుంటారని ఎద్దేవా చేశారు. గ్యాంగ్ స్టర్ నయీం, ఓటుకు నోటు కేసు, మియాపూర్ భూవివాదం వంటి కీలక కేసుల్లో ఇలానే జరిగిందని దుయ్యబట్టారు. ఈ కేసు విషయంలోనూ అకున్ సబర్వాల్ కు ముందు లీవ్ ఎందుకు ఇచ్చారనీ, ప్రతిపక్షాలు ప్రశ్నించగానే ఆయన లీవ్ ఎందుకు క్యాన్సిల్ చేశారనీ, ఎవరిని కాపాడేందుకు ఈ ప్రహసనం అని ప్రశ్నించారు. ఈ కేసులో తెరాస నాయకులు, వారికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారని ఆరోపించారు. దీనికి సంబంధించిన సమాచారం తమ దగ్గర ఉందని షబ్బీర్ అన్నారు.
దిగ్విజయ్ ట్వీట్ లో తప్పేముందంటూ వెనకేసుకొచ్చారు మాజీ పీసీసీ ఛీప్ పొన్నాల లక్ష్మయ్య. వారసుల సన్నిహితులకు సంబంధం ఉందనీ, గుర్తించి విచారించాలని దిగ్విజయ్ కోరడంలో తప్పులేదన్నారు. దానికి గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకోవడమేంటీ అంటూ కేటీఆర్ ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. ఈ కేసును సిట్టింగ్ జడ్జ్ తో ఎందుకు విచారణ చేయించడం లేదనీ, మిగతా పేర్లు ఎందుకు బయటకి రావడం లేదనీ, దిగ్విజయ్ పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అపరిపక్వతను బయటపెడుతున్నాయని పొన్నాల అన్నారు.
సో.. డ్రగ్స్ కేసు విషయంలో ప్రభుత్వ వైఫల్యం ఉందని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తుంటే… గత పాలకుల నిర్వాకమే ఇది అంటూ తెరాస నేతలూ ప్రతివిమర్శలు చేస్తున్నారు. మొత్తానికి, ఈ డ్రగ్స్ కేసు రాజకీయ పార్టీల మధ్య విమర్శనాస్త్రంగా మారిపోయింది. ఈ కేసుపై ఎక్కడా వెనక్కి తగ్గకుండా దూసుకెళ్తున్నామని తెరాస చెబుతోంది. దీన్ని వారు సాధించిన ఘనతగా ప్రచారం చేసుకుంటోంది. ఇక, ఈ కేసు ప్రభుత్వ వైఫల్యమే అంటూ దీనిపై కూడా పొలిటికల్ మైలేజ్ కోసం కాంగ్రెస్ చూస్తోంది. ఇంకేముంది… ఈ కేసులో ఇతర కోణాలన్నీ నెమ్మదిగా తెరపై నుంచి పక్కకు జరిగి, కేవలం రాజకీయ ప్రయోజనాల చర్చగానే మిగలబోతున్నట్టుగా కనిపిస్తోంది.
తమ దగ్గర ఏవో ఆధారాలున్నాయని షబ్బీర్ అలీ అంటున్నారు కదా! అవేవో బయటపెడితే సిట్ కి ఉపయోగకరంగా ఉంటాయి కదా. గతంలో కూడా ప్రాజెక్టుల అవినీతికి సంబంధించి ఆధారాలున్నాయనీ, సమయం వచ్చినప్పుడు బయటపెడతామనీ ఆయనే అనేవారు కానీ, ఆ సమయం ఎందుకో ఇంకా రావడం లేదు! కనీసం ఇప్పుడైనా డ్రగ్స్ కేసు విషయంలో తెరాస నేతలకు సంబంధించిన ఆధారాలను సమయోచితంగా బయటకి తెస్తే… కాంగ్రెస్ కు పొలిటికల్ మైలేజ్ బాగా వస్తుంది కదా!