కాంగ్రెస్ పార్టీకి తెర ముందు రాహుల్ గాంధీ కనిపిస్తారు. కానీ ఆ పార్టీని నడిపేది ఎవరు అంటే ప్రజల్లో పలుకుబడి లేని నేతలు. వారే రాష్ట్రాల్లోని క్రౌడ్ పుల్లర్స్ ను నియంత్రిస్తారు. పనికిమాలిన నేతల్ని తెరపైకి తెస్తారు. వారికి సామాన్య జనంతో టచ్ ఉండదు. కానీ పాలసీల్ని డిసైడ్ చేస్తారు. రాజకీయ వ్యూహాలు అమలు చేస్తారు. అసలు సర్పంచ్ ఎన్నికల్లో ఎలా గెలవాలో కూడా తెలియని కాంగ్రెస్ కోటరీ నేతలు .. రాష్ట్రాల్లో ఎలా గెలవాలో వ్యూహాలు ఖరారు చేస్తే ఫలితాలు హర్యానాలాగే ఉంటాయి.
జైరామ్ రమేష్ ఎవరు ?. తెల్లజుట్టుతో పెద్ద మేధావిలా ఫోజు కొడుతూ తానే కాంగ్రెస్ పెద్ద అన్నట్లుగా అన్నీ డిసైడ్ చేస్తూంటారు. కానీ ఆయనకు ప్రజల్లో ఉన్న పలుకుబడి ఎంత ?. హర్యానా ఎన్నికల ఫలితాలు వచ్చేటప్పుడు మేము అంగీకరించడం అంటూ తెరపైకి వచ్చి కాంగ్రెస్ పరువు తీశారు. బహుశా.. ఆయన హర్యానాలో ఎక్కువగా వేలు పెట్టేసినట్లుగా ఉన్నారు. ఇలాంటి వారు కాంగ్రెస్ లో తెర వెనుక కూడా చాలా మంది ఉంటారు. ఇంచార్జులుగా ఉండమంటే రాష్ట్రాల్లోనే తిష్ట వేసి.. తామే ఆయా రాష్ట్రాలలో పార్టీని నడుపుతామనుకునే మేధావులకు కాంగ్రెస్లో కొదవలేదు.
ముందు కాంగ్రెస్ పార్టీ ఇలాంటి మేధావుల్ని వదిలించుకుని తమ చుట్టూ తిరిగేవారిని కాకుండా… ప్రజల్లో తిరిగేవారిని ప్రోత్సహించాలి. వారిని నియంత్రించేందుకు తమ దూతల్ని పెట్టుకోవడం కన్నా.. ప్రజల్లో తిరిగే వారికి పార్టీకి…. తమకు అనుబంధం పెంచుకునే ప్రయత్నం చేయాలి. అంతే కానీ ఇలాంటి మిడిల్ మ్యాన్స్ ను పెట్టి వారికి చిరాకు తెప్పిస్తే.. పార్టీలో ఎవరూ ఉండరు. ఈ పవర్ బ్రోకర్లు తప్ప. కాంగ్రెస్ పార్టీలో హైకమాండ్ అంటే అంతా అలానే ఉన్నారు. పార్టీ అధ్యక్షుడిగా ఖర్గే ఉన్నా.. ఆయన చేతుల మీదుగా జరిగేవి తక్కువే. జైరామ్ రమేష్ వంటి వారిని కాంగ్రెస్ ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిది. లేకపోతే హర్యానాలాంటి ఫలితాలే వస్తాయి.