ఏపీలో కాంగ్రెస్ కు పునరుజ్జీవనం షర్మిల ద్వారానే సాధ్యమని కాంగ్రెస్ హైకమాండ్ ఫిక్స్ అయింది. ఎన్నికలు ముగిసిన వెంటనే ఢిల్లీకి పిలిపించుకొని పార్టీ బలోపేతం కోసం చేయాల్సిన ప్రణాళికలు ఆమె చెవిన వేశారు. ఆ ప్రణాళికలు అమలు చేసే పనిలోనే ఉన్న షర్మిలను సొంత పార్టీ నేతలు సుంకర పద్మశ్రీ, రాకేష్ రెడ్డి, జంగా గౌతమ్ తోపాటు పలువురు నేతలు షర్మిలపై విమర్శలు గుప్పించారు. ఆమె తీరుతో పార్టీకి నష్టమే తప్ప ప్రయోజనం లేదని..ఎన్నికల్లో పార్టీ ఫండ్ కూడా సరిగా ఖర్చు చేయలేడని ఆరోపించారు.
షర్మిలపై విమర్శలు గుప్పించిన ఈ నేతల వ్యూహం ఏంటో కానీ, రాష్ట్రంలో ఎంతో కొంత పార్టీకి మైలేజ్ తీసుకొస్తున్న షర్మిలపై విమర్శలు గుప్పించడం హాట్ టాపిక్ అయింది. సీనియర్ నేతలుగా సహకరించాల్సిన వీరే షర్మిలకు వ్యతిరేక స్వరాలు వినిపించడం ప్రారంభించారు. దీంతో ఆ నేతలపై అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేతలపై చర్యలు తీసుకునే స్టేజ్ లో అధిష్టానం లేదని అంతా ఫిక్స్ అయ్యారు. అసలే వేళ్ల మీద లెక్కేసే సంఖ్యలో మాత్రమే నేతలు ఉండటంతో షర్మిలపై విమర్శలు చేసిన నేతలపై క్రమశిక్షణ చర్యలు ఉండవనుకున్నారు.
కానీ, ఇటువంటి వాటిపై మెతక వైఖరి అవలంభిస్తే భవిష్యత్ లోనూ మరికొన్ని అసమ్మతి స్వరాలు గుప్పుమంటాయని.. క్రమ శిక్షణ చర్యలకు దిగింది అధిష్టానం. పదవుల నుంచి ఆ నేతలను తప్పించి ఊహించని షాక్ ఇచ్చింది. షర్మిలను విమర్శిస్తే ఎవరికైనా ఇలాంటి అనుభవమే ఎదురు అవుతుందని ..ఎవరూ పార్టీ లైన్ దాటవద్దని.. గీత దాటితే వేటు తప్పదని తాజా నిర్ణయంతో హెచ్చరించినట్లు అయింది.