తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ హైకమాండ్ ప్రశంసల జల్లు కురిపించినట్లుగా తెలుస్తోంది. ఎన్నికల ప్రచారంలో రేవంత్ లేవనెత్తుతోన్న అంశాల ఆధారంగా కాంగ్రెస్ గ్రాఫ్ జాతీయ స్థాయిలో పెరుగుతోందని రేవంత్ పని తీరును అభినందించింది.
ఇటీవల కొన్ని రోజులుగా రేవంత్ ఒకే అంశాన్ని హైలెట్ చేస్తున్నారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు అవుతాయని చెప్తున్నారు. అంతేకాదు అందుకు సంబంధించిన ఆధారాలను కూడా చూపుతున్నారు. బీజేపీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ వందేళ్ల ఎజెండా రిజర్వేషన్ల రద్దు అని రేవంత్ స్పష్టం చేశారు. బీజేపీ చార్ సౌ పార్ నినాదం కూడా రిజర్వేషన్ల రద్దు కోసమేనని… బొటాబొటీ మెజార్టీ వస్తే రిజర్వేషన్ల రద్దుకు ఆటంకం కలుగుతుందని వ్యూహాత్మకంగా ఈ నినాదం ఎత్తుకుందని రేవంత్ బలంగా వాదిస్తున్నారు.
ఈ క్రమంలోనే రేవంత్ వ్యాఖ్యలపై బీజేపీ అగ్రనేతలు సైతం క్లారిటీ ఇవ్వాల్సిన అనివార్యతను సృష్టించారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ వ్యాఖ్యలపై జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సౌత్ ఇండియాలోనే కాదు.. నార్త్ లోనూ రేవంత్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడిందని… ఇది కాంగ్రెస్ కు ఎన్నికల్లో మేలు చేస్తోందని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. ఈ క్రమంలోనే రేవంత్ ను ఏఐసీసీ అగ్రనేతలు అభినందించినట్లుగా సమాచారం.
రిజర్వేషన్లపై బీజేపీ విధానాన్ని గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని ప్రశంసించింది. ఈ విషయంలో బీజేపీ వైఖరిని ఎండగట్టాలని , పార్టీ నుంచి పూర్తి సహకారం ఉంటుందని రేవంత్ కు పార్టీ హైకమాండ్ హామీ ఇచ్చినట్లు సమాచారం.