తెలంగాణ సీఎం కేసీఆర్‌తో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే భట్టి విక్రమార్క,శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి బేటీ కావడం ఇప్పుడు ఆ పార్టీలో ముసలం రేగడానికి కారణం అవుతోంది. అసలు ఎవర్ని అడిగి ముఖ్యమంత్రిని కలిశారని.. ప్రస్తుతం పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ముగ్గురు నేతలపై ఫైరయినట్లుగా చెబుతున్నారు. గాంధీభవన్‌లో ఈ అంశంపై ఉత్తమ్‌తో పాటు.. మిగతా ముగ్గురు నేతల మధ్య వాదోపవాదాలు జరిగినట్లుగా తెలుస్తోంది. కేసీఆర్‌తో భేటీ కారణంగా హుజూరాబాద్‌లో కాంగ్రెస్ .. పరోక్షంగా టీఆర్ఎస్కు మద్దతిస్తుందన్న సంకేతాలు వెళ్తున్నాయి. సోషల్ మీడియాలో టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా అదే అర్థంతో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. నిఖార్సైన కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
హుజూరాబాద్‌లో ఇప్పటికే.. గడ్డు పరిస్థితి ఉంటుందన్న అంచనాల మధ్య.. కేసీఆర్‌తో భేటీ ద్వారా… ఇక టీఆర్ఎస్ వైపే అన్న సంకేతాలను పంపినట్లయిందన్న అభిప్రాయం ఏర్పడింది. కేసీఆర్ కూడా.. కాంగ్రెస్ నేతలు విజ్ఞప్తి చేశారని.. లాకప్‌డెత్‌కు గురైన మహిళ కుటుంబానికి ఉద్యోగ, ఆర్థిక సాయాలు ప్రకటించారు. ఇది కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య మరింత రాపో ఉందని చెప్పడానికి సాక్ష్యంలా మారింది. ముగ్గురు ఎమ్మెల్యేల తీరుపై.. హైకమాండ్‌కు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలందర్నీ ఆకర్షించి.. దళితుడైన భట్టి విక్రమార్కకు.. ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా లేకుండా టీఆర్ఎస్ అధినేత… ఇప్పుడు దళితుల హక్కులను రక్షిస్తారని అంటే.. అదే భట్టి విక్రమార్క ఎలా నమ్మారని.. ఆయన కూడా.. ప్రభుత్వం పట్ల సానుకూలంగా వ్యవహరించడం ఏమిటన్న ప్రశ్న పార్టీలోని ఇతర వర్గాల నుంచి వస్తోంది. నిజానికి శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి, భట్టిలతో ఉత్తమ్‌కు సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. కానీ.. హుజూరాబాద్‌లో కాంగ్రెస్ తరపున బరిలో ఉండేది.. ఉత్తమ్ దగ్గరి బంధువు కౌశిక్ రెడ్డి. ఈ కారణంగా ఆయన అసంతృప్తికి గురయినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే.. ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.. బోనస్‌గా కేసీఆర్‌కు కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్టగలిగారని.. కొంత మంది విశ్లేషిస్తున్నారు.