లోక్‌సభ ఎన్నికలకు తెలంగాణ గడ్డ మీద నుంచే కాంగ్రెస్ పార్టీ సమరశంఖం పూరించనుంది. 6న జనజాతర సభ ద్వారా జాతీయ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. సభను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ ఈ సభకు హాజరుకానున్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇదే స్థలంలో తొలి బహిరంగ సభను నిర్వహించింది.
తెలంగాణ విలీన దినోత్సవాన్ని పురస్కరించుకుని సెప్టెంబరు 17న తుక్కుగూడలో విజయభేరి పేరిట భారీ బహిరంగ సభను కూడా నిర్వహించింది. విజయభేరి వేదిక మీద నుంచే సోనియాగాంధీ ఆరు గ్యారంటీలను ప్రకటించారు. ఆయా గ్యారంటీలు తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని చూరగొనడంతో కాంగ్రెస్ శాసనసభ ఎన్నికల్లో ఘనవిజయం సాధించింది. తమకు కలిసివచ్చిన తుక్కుగూడ నుంచే లోక్‌సభ ఎన్నికలకు సమరశంఖం పూరించాలని ఆ పార్టీ అధిష్టానం నిర్ణయించింది.
తెలంగాణ ఎన్నికల్లో ఆరు గ్యారంటీల హామీ ప్రజల్లోకి దూసుకెళ్లినట్టుగానే లోక్‌సభ ఎన్నికలకు ఇచ్చే ఐదు గ్యారంటీలు దేశంలోని అన్ని మూలలకు, అన్ని వర్గాల్లోకి వెళుతాయని కాంగ్రెస్ అగ్ర నాయకత్వం బలంగా నమ్ముతున్నది. తుక్కుగూడ వేదికగా నిర్వహించిన విజయభేరి సభలో పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆనాడు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనీ, డిసెంబరు 9వ తేదీన కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరుతుందని కుండబద్దలు కొట్టి చెప్పారు. తాజాగా కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనీ, ఢిల్లీ రాంలీలా మైదాన్‌లో లక్షలాది ప్రజల సమక్షంలో తమ ప్రభుత్వం కొలువుదీరుతుందని సీఎం రేవంత్‌రెడ్డి చెబుతున్నారు. ఈ సెంటిమెంట్ హైకమాండ్ నేతల్ని కూడా ఆకర్షిస్తోంది.