తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పూర్తి స్థాయిలో రేవంత్ పట్టు బిగించినట్లుగా కనిపిస్తోంది. ఆయనకే హైకమాండ్ ఫుల్ సపోర్ట్‌గా ఉంటోంది. తాజాగా కొంత మంది నేతల చేరికల విషయంలో నేతలు అసంతృప్త స్వరాలు అంతర్గతంగా వినిపిస్తున్నారు. ఖమ్మం నుంచి తాటి వెంకటేశ్వర్లు, జడ్చర్ల నుంచి ఎర్రశేఖర్ వంటి వారి చేరికపై కొంత మంది అసంతృప్తి వినిపించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఈ విషయంలో రేవంత్ తీరుపై మండి పడినట్లుగా ప్రచారం జరిగింది. అయితే పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మాణిగం ఠాగూర్ అందరికీ ఓ క్లారిటీ ఇచ్చేశారు.
పార్టీలో చేరికలను ఎవరూ అడ్డుకోవద్దని స్పష్టం చేశారు. ఇంకా ఒకరిద్దరు పార్టీ అంతర్గత అంశాలపై మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఇకపై ఎవరైనా మాట్లాడితే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఐదేళ్లు పార్టీ కోసం పని చేసిన వారికే ప్రమోషన్లు అని తెలిపారు. అలాగే ఐదేళ్లు డీసీసీలో పనిచేసిన వారికి పీసీసీలో అవకాశం ఉంటుందన్నారు. మాణిగం ఠాగూర్ పూర్తిగా రేవంత్‌కు మద్దతు పలికినట్లుగా మాట్లాడటంతో సీనియర్ నేతలకు షాకిచ్చినట్లయింది. ఇటీవల రాష్ట్రపతి అభ్యర్థికి ప్రచారం విషయంలో వీహెచ్, జగ్గారెడ్డి రచ్చ చేశారు.
వారి తీరుపై హైకమాండ్ సీరియస్ అయింది. ఇప్పుడు మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. ఇలాంటి వారికి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వడంపై ఆలోచించాలని భావిస్తున్నారు. మొత్తంగా ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డికి తిరుగులేని హ్యాండ్ ఇచ్చారు.. ఆయన వరుసగా ఇతర పార్టీల నేతల్ని .. చేర్చుకుంటూడటంతో జోష్ వస్తోంది. రేవంత్ రెడ్డికి హైకమాండ్ సపోర్ట్ ఉందంటే.. మరింత మంది నేతలు పార్టీలోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.