ఏదైనా కాంగ్రెస్ పార్టీ సింపుల్‌గా చేద్దామనుకుంటుంది. కానీ చినిగి చేటంతవుతుంది. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఒకే ఒక్కపెద్ద రాష్ట్రం రాజస్తాన్. గతంలోనే సచిన్ పైలట్ తిరుగుబాటుతో ప్రభుత్వం కూలిపోతుందన్న పరిస్థితి నుంచి బయటపడింది. కానీ ఇప్పుడు తప్పించుకోలేకపోతోంది. కాంగ్రెస్ అధ్యక్షుడిగా గాంధీయేతర కుటుంబం నుంచి నేత ఎన్నికయ్యేందుకు వీలుగా ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అందులో రాజస్థాన్ సీఎం గెహ్లాత్ పోటీ చేయాలని హైకమాండ్ ఆదేశించింది. ఆయన ఖచ్చితంగా సీఎం పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపట్టాల్సి ఉంది.
అప్పుడు ఆటోమేటిక్‌గా ఆ పదవి సచిన్ పైలట్‌కు దక్కుతుంది. కానీ గెహ్లోత్.. ఆయన వర్గం ఎమ్మెల్యేలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సచిన్ పైలట్ సీఎం కాకూడదని పట్టుబడుతున్నారు. దాదాపుగా 90 మంది ఎ్మెల్యేలు రాజీనామా చేస్తామని అంటున్నారు. గతంలో ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నించిన సచిన్ పైలట్ ను సీఎంను చేయడానికి తాము అంగీకరించబోమని వారంటున్నారు. స్పీకర్ గా ఉన్నఎమ్మెల్యేను సీఎంను చేయాలని గెహ్లాద్ ప్రతిపాదిస్తున్నారు.
కానీ సచిన్ పైలట్‌కు ఇవ్వకపోతే ఆయన వర్గం వేరే దారి చూసుకునే అవకాశం కనిపిస్తోంది. ఒక వేళ ఇస్తే గెహ్లాత్ వర్గం ఊరుకోదు.కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎన్నిక ఎలా జరుగుతుందో కానీ అధికారంలో ఉన్న ఓ రాష్ట్ర రాజకీయం సంక్షోభంలో పడిపోయింది. రాష్ట్రపతి పాలన విధిస్తామంటూ బీజేపీ నేతలు ఇప్పటికే మైండ్ గేమ్ ప్రారంభించారు. గెహ్లాత్ స్వార్థపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆయనను అసలు అధ్యక్షుడిగా ఎన్నుకోవద్దు.. అలాగే.. సీఎం పదవి నుంచి తప్పించాలని.. కాంగ్రెస్ ముఖ్య నేతలు డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి సింపుల్‌గా చేద్దామనుకున్న ఓ ప్రక్రియ ఇప్పుడు గడ్డు పరిస్థితి తెచ్చి పెట్టింది.