తెలంగాణ జనసమితి వ్యవస్థాపకుడు కోదండరామ్ ఢిల్లీ వెళ్లారు, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని కలిసిన సంగతి తెలిసిందే. సీట్ల పంపకాలకు సంబంధించిన నంబర్ మీద ఇంకా సిగపట్లు కనిపిస్తున్న పరిస్థితే. అయితే, ఆయనతో భేటీ అనంతరం… తెలంగాణ కాంగ్రెస్ నేతలకు హై కమాండ్ ఓ సూచన చేసినట్టు సమాచారం. తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి నెల మాత్రమే గడువు కనిపిస్తున్న నేపథ్యంలో… కోదండరామ్ సేవల్ని ఎంత ప్రభావవంతంగా వాడుకోవాలనే అంశంపై సూచనలు అందినట్టుగా తెలుస్తోంది.
కోదండరామ్ తో ప్రచారం అనే అంశంపై పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో అధిష్టానం మాట్లాడినట్టుగా విశ్వసనీయ సమాచారం. రాబోయే రోజుల్లో పార్టీ చేపట్టే ప్రచార కార్యక్రమాల్లో కోదండరామ్ ను ముందుంచి నడపాలని చెప్పినట్టుగా వినిపిస్తోంది. రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క.. ఇలా ప్రముఖ నేతల సభల్లో కూడా ఆయనకి ప్రాధాన్యత కల్పించాలని అధినాయకత్వం చెప్పిందట. మరీ ముఖ్యంగా, జిల్లా కేంద్రంలో నిర్వహించే బహిరంగ సభల్లో ఆయన్ని తప్పక తీసుకెళ్లాలనే వ్యూహాన్ని రాష్ట్ర నేతలకు వివరించిందని సమాచారం. నిర్వహించే సభల్లో కూడా ఆయన మాట్లాడేందుకు కాస్త ప్రాధాన్యత ఇవ్వాలని కూడా సూచించినట్టు తెలుస్తోంది.
కాంగ్రెస్ ప్రచారంలో కోదండరామ్ కు ప్రాధాన్యత కల్పించాలన్న హైకమాండ్ ఆలోచన వెనక వ్యూహం ఏంటనేది ఇట్టే అర్థమౌతోంది కదా! కేసీఆర్ మీద ఉత్తమ్, రేవంత్ వంటివాళ్లు ఎంతమంది ఎన్ని విమర్శలు చేసినా… తెరాస నుంచి అంతే ధీటైన సమాధానాలు వస్తున్నాయి. అదే, కేసీఆర్ మీద కోదండరామ్ విమర్శలు చేశారే అనుకోండి… తెరాస నుంచి ఆ స్థాయిలో ప్రతిస్పందన ఉండదు. కోదండరామ్ విమర్శల్ని మరీ పూచికపుల్ల తీసి పడేసినంత ఈజీగా కేసీఆర్ తో సహా ఎవ్వరూ వ్యవహరించరు. గతంలో కూడా ఈ పరిస్థితి చూశాం.
ఎందుకంటే, తెలంగాణ సమాజంలో ఉద్యమనేతగా కేసీఆర్ కి ఎంత గుర్తింపు ఉందో, అదే ఉద్యమంలో మేధావి వర్గానికి చెందిన వ్యూహకర్తగా అంతే ప్రాధాన్యత కోదండరామ్ కి ఉంది. ఆయన సౌమ్యుడు, అందరివాడు అనే ఇమేజ్ కొంత ఉంది. అందుకే, ఆయన్ని అంత ఈజీగా విమర్శించే ప్రయత్నం తెరాస నేతలు చెయ్యరు. కాబట్టి, ఇదే పాయింట్ ను తమకు అనుకూలంగా మార్చుకోవడమనేది కాంగ్రెస్ వ్యూహం. మహా కూటమి ప్రచార సభల్లో ఆయనకి మైక్ ఇవ్వడం ద్వారా చాలా మేలు జరుగుతుందని భావిస్తున్నారు. అయితే, కోదండరామ్ అవసరం ఇంతగా ఉందని రాష్ట్ర నేతలకు హైకమాండ్ చెబుతూనే.. ఆయన పార్టీకి సీట్ల కేటాయింపు విషయానికి వచ్చేసరికి.. 8 నుంచి 10 మాత్రమే అంటుండటం విచిత్రం.