రాజకీయానికి నేను దూరం అయినా రాజకీయాలు మాత్రం తనకు దూరం కాలేదని చిరంజీవి డైలాగ్ చెప్పి ఒక్క రోజు గడవక ముందే కాంగ్రెస్ పార్టీలో ఆయనకు గుర్తింపు కార్డు జారీ అయింది. 2027 వరకూ చెల్లుబాటు అయ్యేలా పీసీసీ డెలిగేట్‌గా కార్డును ఏఐసీసీ జారీ చేసింది. ఈ కార్డు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2014లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత కొంత కాలం క్రియాశీలకంగా ఉన్నప్పటికీ తర్వాత చిరంజీవి పూర్తిగా రాజకీయాలకు దూరం అయ్యారు. కాంగ్రెస్ సభ్యత్వాన్ని పునరుద్ధరించుకోలేదు.
రాజ్యసభ సభ్యునిగా సమావేశాలకూ వెళ్లలేదు. ఇందు కోసం అప్పట్లో రాజ్యసభ చైర్మన్ అనుమతిని తీసుకున్నారు. పదవి కాలం పూర్తయ్యే రోజు కూడా సభకు వెళ్లలేదు. తాను ప్రత్యక్ష రాజకీయాలను వదిలేశానని ఇటీవలే చిరంజీవి బహిరంగంగా ప్రకటించారు. అయితే గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్లో భాగంగా ఓ పొలిటికల్ డైలాగ్‌ను వదలడం.. అది వైరల్ అయిన మరుసటి రోజే ఏఐసిసి నుంచి డెలిగేట్ కార్డు మీడియాకు విడుదల కావడం యాధృచ్చికం కాదన్న వాదన వినిపిస్తోంది.
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ జరుగుతోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఓటర్ల జాబితాను రెడీ చేసింది. ఆ ఓటర్ల జాబితాలో చిరంజీవి కూడా ఉన్నారు. అందుకే కార్డు జారీ అయినట్లుగా తెలుస్తోంది. చిరంజీవి కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభ సభ్యుడు, కేంద్రమంత్రిగా పని చేశారు. మాజీ ఎంపీలు.. కేంద్రమంత్రులు అందరికీ ఆయా రాష్ట్రాల వారీగా పీసీసీ డెలిగేట్ కార్డులు జారీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.