కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై చర్యలు తీసుకోవడానికి కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పటికీ ఆలోచన చేస్తోంది. ఆయన పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించారని పది రోజుల కిందట షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కానీ ఆయన స్పందించలేదు. తెలంగాణలో రాహుల్ గాంధీ పాదయాత్ర జరుగుతున్నా ఆయన పట్టించుకోలేదు. తాజాగా ఆయనకు మరోసారి కాంగ్రెస్ క్రమశిక్షణా సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ సారి మరో పది రోజుల సమయం ఇచ్చింది.
మునుగోడు ఉపఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన సోదరుడు బీజేపీ అభ్యర్థి అయిన రాజగోపాల్ రెడ్డికి పరోక్షంగా సహకరించారు. కాంగ్రెస్ పై వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం ద్వారా సొంత పార్టీపై కుట్ర చేశారని ఆరోపణలు వస్తున్నాయి. పైగా మునుగోడులో కృష్ణారెడ్డి అనే ఆర్థికంగా బలమైన అభ్యర్థికి టిక్కెట్ ఇవ్వాలని అనుకున్నా.. కోమటిరెడ్డి తాను ప్రచారం చేస్తానని చెప్పి… పాల్వాయి స్రవంతికి ఇప్పించారని చెబుతున్నారు. అలా అభ్యర్థిత్వం ఇప్పించిన తర్వాత కోమటిరెడ్డి హ్యాండిచ్చారు.
ఇప్పుడు కోమటిరెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నదానిపై రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ఆయన సిట్టింగ్ ఎంపీ, పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే నేరుగా వెళ్లి బీజేపీలో చేరుతారని అంటున్నారు. అయితే సస్పెండ్ చేయకపోతే.. ఆయన పార్టీకి ఇంకా నష్టం చేస్తారని.. ఎంత చేసినా ఆయన పార్టీ పట్ల ఇక విధేయంగా ఉండరని మరికొందరు వాదిస్తున్నారు. ఫైనల్గా కోమటిరెడ్డి విషయంలో … ఈ నెలలోనే ఏదో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. రాహుల్.. పాదయాత్ర.. తెలంగాణ దాటిన తర్వాత ఆయనపై వేటు వేయవచ్చని అంటున్నారు.