తెలంగాణ కాంగ్రెస్ లో చేరిన దగ్గర నుంచీ అదిగో ఇదిగో రేవంత్ రెడ్డికి కీలక పదవి ఇచ్చేస్తున్నామనే ఊహాగానాలే తప్ప, హైకమాండ్ నుంచి స్పష్టమైన ఆదేశాలు ఇంకా వెలువడలేదు. దీంతో రేవంత్ రెడ్డి కాస్త అసంతృప్తిగా ఉన్నారనీ, తన వర్గానికీ పదవులు దక్కించుకోలేకపోయారన్న అభిప్రాయమూ సొంత కేడర్ నుంచి వ్యక్తమౌతున్న పరిస్థితి. బస్సుయాత్ర తరువాత రేవంత్ కొంత జోరు తగ్గించారు. ఢిల్లీ వెళ్లి తన మనోభావాన్ని కూడా వివరించి వచ్చారు. ప్రస్తుతం, ఇద్దరు సభ్యుల సభ్యత్వ రద్దు పునరుద్ధరణ పోరులో కూడా రేవంత్ మ.మ. అన్నట్టుగానే పాత్ర పోషిస్తున్నారు. కాంగ్రెస్ నేతలు స్పీకర్ ను కలిసినప్పుడు మాత్రమే ఆయనా ఓ మాట అన్నారు. అంతేతప్ప, గతంలో మాదిరిగా ఒక ప్రెస్ మీట్ పెట్టి.. కేసీఆర్ సర్కారు హైకోర్టు ఆదేశాలను కాలరాస్తోందంటూ హడావుడి చెయ్యలేదు. అయితే, రేవంత్ పదవికి సంబంధించిన సస్పెన్స్ కి నేడో రేపో తెరపడే అవకాశం కనిపిస్తోంది.
పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ గురువారం నాడు ఢిల్లీ వెళ్లారు. ఇది ముందుగా ప్లాన్ చేసుకున్న పర్యటన కాదు! హుటాహుటిన బయల్దేరి వెళ్లిపోయారు. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ కుంతియాతోపాటు పలువురు కాంగ్రెస్ నేతల్ని కలుసుకున్నారు. ఎమ్మెల్సీ దామోదర్ పార్టీ వీడటం, త్వరలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఉండటం, పార్టీ జిల్లా అధ్యక్షుల నియామకం వంటి అంశాలు ఈ సందర్భంగా చర్చించినట్టు సమాచారం. పనిలోపనిగా టీ కాంగ్రెస్ ప్రచార కమిటీ అధ్యక్షుడు పదవి ఎవరికి ఇవ్వాలనే చర్చ కూడా వాడీవేడిగా జరిగినట్టు తెలుస్తోంది. నిజానికి, ఈ పదవి రేవంత్ రెడ్డి ఇస్తారన్న ప్రచారం ఉంది. కానీ, సీనియర్ నేత వీహెచ్ కూడా దీనిపై కన్నేశారు. ఆయనా ఆశిస్తున్నారు.
రేవంత్ రెడ్డి పార్టీలో ప్రాధాన్యం పెంచితే కాంగ్రెస్ నుంచి మరిన్ని వలసలు ఉంటాయన్న సంకేతాలు ఇస్తోంది డీకే అరుణ వర్గం! ఇప్పటికే ఎమ్మెల్సీ దామోదర్ బయటకి వెళ్లిపోయారు. దీంతో ప్రచార కమిటీ అధ్యక్ష పదవి ఎవరికి ఇస్తే ఏమౌతుందనే తర్జనభర్జన ఢిల్లీలో కొనసాగుతున్నట్టు సమాచారం. అయితే, శుక్రవారం నాడు అధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఉత్తమ్ భేటీ అయ్యే అవకాశాలున్నాయి. పదవికి సంబంధించి రాహుల్ స్పష్టత ఇచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఏదేమైనా, రేవంత్ కి పదవి ఇవ్వాల్సిన ఒత్తిడి కనిపిస్తోంది. ఇస్తే… పార్టీలో మరో వర్గం రియాక్షన్ ఎలా ఉంటుందో అనే చర్చ కూడా జరుగుతోంది. తనకీ, తనతోపాటు వచ్చినవారికీ పార్టీలో గుర్తింపు లేదనే అసంతృప్తిలోకి రేవంత్ నెమ్మదిగా జారుకునే పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాహుల్ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.