సార్వత్రిక ఎన్నికల్లో దారుణంగా దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ, గత వైభవాన్ని సొంతం చేసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంది. నిరుటి ఎన్నికల్లో నగర పరిధిలో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ గెలవలేదు. దీంతో గ్రేటర్ ఎన్నికల్లో పార్టీ పరస్థితి ఎలా ఉంటుందోనని నాయకులు, కార్యకర్తలు కొంత కాలంగా సందిగ్ధంలో పడ్డారు. అయితే, సీమాంధ్రుల ఓట్ల తొలగింపుపై మర్రి శశిధర్ రెడ్డి చేసిన పోరాటం కాంగ్రెస్ కు కొంత వరకూ కొత్త ఇమేజి తెచ్చింది. ఆయన చొరవ వల్లే ఈసీ అధికారులు విచారణకు వచ్చారు. పెద్ద సంఖ్యలో ఓట్ల తొలగింపు ఆగిందంటే అందుకు కాంగ్రెస్ నాయకుడి ప్రయత్నమే కారణమంటూ ఇప్పుడు ఆ పార్టీ కేడర్ చెప్పుకుంటోంది.
ఎన్నికల ప్రక్రియను కుదించడం, రిజర్వేషన్ల వెల్లడి జాప్యం చేయడం, ప్రతిపక్షాలకు ప్రచారానికి సమయం ఇవ్వకుండా చేయడానికి ప్రయత్నించడం ద్వారా తెరాస ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతోందని కాంగ్రెస్ పార్టీ గట్టిగా ప్రతిఘటించింది. ప్రకటనలకే పరిమితం కాకుండా శశిధర్ రెడ్డి న్యాయ పోరాటానికి సిద్ధపడ్డారు. ఆయన చొరవ వల్లే ఈ అంశం హైకోర్టు వరకూ వెళ్లింది. ప్రక్రియ కుదింపుపై స్టే వచ్చింది. ప్రజాస్వామ్య బద్ధంగా, నిబంధనల ప్రకారం ఎన్నికల నిర్వహణకు కోర్టు ఆదేశించింది. ఇది తమకు పెద్ద విజయమని కాంగ్రెస్ వారు గొప్పగా చెప్పుకుంటున్నారు.
గత ఏడాది ఎన్నికల తర్వాత నగరంలో పార్టీకి కొత్త ఉత్తేజం తేవడానికి గట్టి ప్రయత్నం పెద్దగా జరగలేదు. అసలు గ్రేటర్ అధ్యక్షుడే పార్టీలో ఉంటారో, తెరాసలో చేరుతారో అనే చర్చ జరిగింది. దానం నాగేండర్ కారు ఎక్కబోతున్నారని చాలా సార్లు ప్రచారం జరిగింది. రకరకాల ఊహాగానాలు వచ్చాయి. తెరాస మంత్రులతో కూడా ఆయన భేటీ అయ్యారని వదంతులు వచ్చాయి. దానం మాత్రం మొదటి నుంచీ తాను కాంగ్రెస్ లోనే ఉంటానని స్పష్టం చేస్తున్నారు. గిట్టని వారు పుట్టించే వదంతులు నమ్మ వద్దని పదే పదే స్పష్టం చేశారు. అయినా, ఒక మైండ్ గేములో భాగంగా ప్రత్యర్థులు ఈ ప్రచారం చేశారని దానం వర్గీయులు భావిస్తున్నారు. ఆయన సిసలైన కాంగ్రెస్ వాది అని అనుచరులు బల్లగుద్ది చెప్తున్నారు. అన్నట్టే ఆయన పార్టీ బలోపేతానికి ప్రస్తుతం ప్రయత్నాల్లో ఉన్నారు.
అయితే, శశిధర్ రెడ్డి పోరాటం కాంగ్రెస్ కు నూతనోత్తేజం ఇచ్చిందని ఆ పార్టీ రాష్ట్ర స్థాయి నాయకులు కూడా భావిస్తున్నారు. విద్యావంతులైన ఓటర్లను ఆలోచింపచేసే ఈ పరిణామాం మేలు చేస్తుందంటున్నారు. పైగా ఈ పోరాటం ద్వారా సీమాంధ్రుల మనసు గెల్చుకున్నామని వారు అంచనా వేస్తున్నారు. ఓట్ల తొలగింపుపై చేసిన పోరాటం వల్ల సీమాంధ్ర ఓట్లలో చాలా వరకు హస్తం గుర్తుకే పడతాయనేది కాంగ్రెస్ వారి ఆశ.
ఓట్లు, సీట్లు ఎన్ని వస్తాయనేది పక్కనబెడితే, కొత్త జోష్ మాత్రం వచ్చిందని కాంగ్రెస్ వారు సంబరపడుతున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ కోసం పోటీ కూడా బాగానే ఉంది. గట్టిగా కష్టపడితే మంచి ఫలితాలు సాధించ వచ్చనే కాంగ్రెస్ నేతల అంచనాలు నిజమవుతాయో లేదో చూద్దాం.