గాంధీ, నెహ్రూలే స్వతంత్రభారత దేశపు తాత్విక దృక్పధాలు అని దేశంలో విదేశాల్లో వున్న ప్రాచుర్యాన్ని, భావజాలాన్ని చెరిపివేయడానికి బిజెపి మొదలు పెట్టిన కృషిని కాంగ్రెస్ గుర్తించలేకపోయింది. నేతాజీ వ్యవహారంలో మమతా బెనర్జీ కాంగ్రెస్ ను దోషిగా నిలబెట్టాక,చేతులుకాలాక ఆకులు పట్టుకున్నట్టు నెహ్రూ ఇమేజి భగ్నం కాకుండా ప్రచారం చేయాలని ఇపుడు నిర్ణయించింది. అయితే, సమావేశాల్లో ఉపన్యసించగలవారే తప్ప ప్రజల్లోకి వెళ్ళి పనిచేసే కార్యకర్తలు లేకపోవడం కాంగ్రెస్ కు ఒక లోపం. గాంధీ నెహ్రూలను ప్రస్తావించకుండా కాంగ్రెస్ ఏపనీ చేయదు. ఇలాంటి నేపధ్యంలో గుజరాత్ లోని నర్మదా డామ్ ఎదురుగా ప్రపంచంలోనే ఎత్తయిన విగ్రహంగా సర్ధార్ వల్లభాయ్ పటేల్ స్మృతిని 2 వేల కోట్ల రూపాయలతో ప్రతిష్టించడానికి ఒక ట్రస్టు ఏర్పడింది. ప్రధాని పదవి లక్ష్యంగా నిర్ణయించకున్న నరేంద్రమోదీ సంకల్పం నుంచే ఈ ట్రస్టు పుట్టుకొచ్చింది. మోదీ ప్రధాని అయ్యాక కేంద్రం నుంచి 2 వందల కోట్ల రూపాయలు విడుదల చేశారు.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం పై నిజానిజాలను వెల్లడిస్తామని కూడా బిజెపి ఎన్నికల సమయంలో చెప్పింది.బిజెపి కన్నా వేగంగా స్పందించిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తమ రాష్ట్రంలో ఉన్న నేతాజీ ఫైళ్లను బయటకు తీశారు. ఆతరువాత మోదీ తన నివాసంలో నేతాజీ కుటుంబీకులైన వారసులకు విందు ఇచ్చి కేంద్రం వద్ద వున్న ఫైళ్ళను జనవరిలో బహిర్గతం చేస్తామని చెప్పారు. బ్రిటిష్ దురాక్రమణ నుండి మాతృభూమికి విముక్తిని కలిగించడం కోసం సుభాష్ చంద్రబోస్ ఎవరూ చేయని సాహసాలు చేశారు. అంతటి వీరుడు 1945 నుంచి భారత ప్రజలకు కనుమరుగు కావడం అంతుపట్టని పరిణామం. 1945 తరువాత కూడ అనేక సంవత్సరాలు ఆ స్వాత్రంత్య సమరవీరుడు జీవించాడన్నది ప్రజల నమ్మకం .
మమతా బెనర్జీ బయటపెట్టిన ఈ అధికారిక పత్రాలవల్ల నేతాజీ గురించి వివరాలు కొద్ది మేరకు తెలుస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం వద్ద ఇన్ని ఏళ్లుగా మరెన్నో అధికార పత్రాలు నిక్షిప్తమయి ఉన్నాయి. అన్నీ వెల్లడయితే తప్ప నేతాజీ జీవన ప్రస్థానం అర్ధంకాదు. మమతా బెనర్జీ బయటపెట్టిన పత్రాల వల్ల 1949లో కూడ సుభాష్ చంద్రబోస్ జీవించి ఉన్నారన్న అంశం బయటికి వచ్చింది.నేతాజీ ఆకాశవాణి ప్రసారాల ద్వారా దేశ ప్రజలతో ప్రసంగించడానికి 1949లో యత్నించినట్టు కూడా ఆధారాలున్నాయట. కాంగ్రెస్ నాయకత్వంలో స్వాత్రంత్యం కోసం జరిపిన సత్యాగ్రహ ఉద్యమం విజయవంతం కావడానికి నేతాజీ సాగించిన యుద్ధం దోహదం చేసిందనేది చరిత్ర. సాయుధ సమర జ్వాలలు తమ దురాక్రమణను దహించి వేస్తాయన్న భయంతోనే బ్రిటన్ పాలకులు మనదేశం నుండి న్రిష్కమించారు. కాంగ్రెస్కు అధికారం అప్పగించడం ద్వారా ఘోర పరాజయం నుండి వారు తప్పించుకోగలిగారు. అందువల్ల స్వాత్రంత్య ఉద్యమ ఫలాలను 1947 తరువాత అనుభవించిన జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం , ఇందుకు సహకరించిన నేతాజీని 1947 తరువాత సగౌరవంగా దేశానికి రప్పించి ఉండాలి. అయితే అలా చేయలేదు. ఇదీ జాతీయ చరిత్రకు, జాతికి జరిగిన ఘోరమైన అన్యాయం.
వీటన్నింటిని అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం పట్టించుకోలేదు. పట్టించుకోకపోగా నేతాజీ కుటుంబ సభ్యులపై ప్రభుత్వం నిఘావేసి ఉంచింది. కేంద్ర ప్రభుత్వం, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం దశాబ్దాల తరబడి సుభాష్ కుటుంబ సభ్యుల కలాపాలను కనిపెట్టడం ద్వారాను, వారు పరస్పరం జరుపుకునే ఉత్తర ప్రత్యుత్తరాలను నియంత్రించడం -సెన్సారింగ్- ద్వారాను నేతాజీని అవమానించాయి. ఆయన స్వదేశానికి తిరిగి రాకుండా నిరోధించాయి. ఇలాంటి అంశాలు సాధికారితతో వెల్లడి అయితే ఇక కాంగ్రెస్ కు వున్న ఆదరణ ధ్వంసమై పోతుంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్కు సంబంధించిన వాస్తవాలపై జరుగుతున్న చర్చ కాంగ్రెస్ పార్టీకి మింగుడుపడని రీతిలో రూపుదిద్దుకోవడానికి ఎంతో కాలం పట్టదు. ఇప్పటికే నేతాజీ జీవితానికి, అదృశ్యానికి సంబంధించి వెల్లడైన అంశాలు కాంగ్రెస్ పార్టీ నేతలనే దోషులుగా చూపిస్తున్నాయి.
ఇలా ఆత్మరక్షణలో పడిపోయిన కాంగ్రెస్ నవంబరు 14 న డిల్లీలో జరిగే నెహ్రూ శతజయంతి ముగింపు బహిరంగ సభను బ్రహ్మాండంగా నిర్వహించాలని నిర్ణయించింది. నలుగురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పిసిసి అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులకు సూచించారు. ఢిల్లీ మహాసభకు ప్రతి రాష్ట్రం నుంచి పెద్దఎత్తున పార్టీ కార్యకర్తలు హాజరుకావాలని కూడా నిర్ణయించారు. బహిరంగ సభకు ముందు నవంబర్ ఏడు, ఎనిమిది తేదీల్లో తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ సాధించిన ఘన విజయాలపై దేశ వ్యాప్తంగా సదస్సులు నిర్వహిస్తారు.
అయితే గత ఏడాది నవంబరు 14 న మొదలైన నెహ్రూ శతజయంతి ఉత్సవాలు ఇప్పటి వరకూ సాధించింది ఏదీలేదు.