కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రెండు రోజుల హైదరాబాద్ పర్యటనకు సోమవారం మధ్యాహ్నం రానున్నారు. శంషాబాద్‌లో మహిళా స్వయం సహాయక బృందాలతో సమావేశం దగ్గర్నుంచి మంగళవారం సాయంత్రం సరూర్ నగర్ స్టేడియంలో నిరుద్యోగ గర్జన వరకు అనేక పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాహుల్ గాంధీ కేటాయించిన రెండు రోజుల సమయాన్ని సద్వినియోగం చేసుకుని అన్ని వర్గాలను ఆకట్టుకునేందుకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. కానీ అదంతా కాంగ్రెస్ మార్క్ పద్దతిలోనే సాగుతోంది. అందుకే రాహుల్ టూర్ ఎలా సాగుతుందా.. అన్న ఉత్కంఠ ఆ పార్టీ నేతల్లో ఏర్పడింది.
దీనికి సజీవ సాక్ష్యం.. కోమటిరెడ్డి బ్రదర్స్ పార్టీ నిష్క్రమణ వార్తలు. కోమటిరెడ్డి సోదరులపై పార్టీ మార్పు వార్తలు తరచుగా వస్తూంటాయి. గతంలో అటు బీజేపీతోనూ.. ఇటు టీఆర్ఎస్తోనూ చర్చలు జరిపారని విస్త్రతంగా ప్రచారం జరిగింది. తర్వాత సైలెంట్ అయ్యారు. కోమటిరెడ్డి ఎమ్మెల్యే పదవిని కేసీఆర్ ఊడగొట్టేశారు. బీజేపీ వైపు వెళ్లే అవకాశం లేదు. దీంతో కోమటిరెడ్డి పార్టీ వలస వార్తలకు బ్రేక్ పడింది. ఆ తర్వాత పీసీసీ చీఫ్ అధ్యక్ష పదవి కోసం వారు గట్టిగానే ఢిల్లీలో లాబీయింగ్ చేసుకుంటున్నారు. ఉత్తమ్‌ను త్వరలో పక్కన పెట్టేస్తారని.. కోమటిరెడ్డినే తర్వాత పీసీసీ చీఫ్ అన్నట్లుగా ఆయన వర్గీయులు ప్రచారం చేస్తున్నారు. ఈ తరుణంలో.. రాహుల్ రాకకు ఒక్క సారి ముందు… మళ్లీ కోమటిరెడ్డి పార్టీ మారబోతున్నారని ప్రచారం ఊపందుకుంది. దీన్ని ఆయన ఖండించారు. కానీ నిప్పులేనిదే పొగరాదని.. కాంగ్రెస్‌లోని ఆయన వ్యతిరేక వర్గీయులు జోరుగానే ప్రచారం చేస్తున్నారు.
ఇక ఇతర కాంగ్రెస్ నేతల వ్యవహారశైలి కూడా ఆ పార్టీ కార్యకర్తల్ని ఆందోళనకు గురి చేస్తోంది. అందరూ తమను తాము సీఎం అభ్యర్థులుగా ఊహించుకుంటూ.. ఒకరినొకరు తీసి పారేస్తున్నారు. సొంత ఇమేజ్ కోసం కార్యక్రమాలు చేపడుతున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి.. వరుసగా.. తనకు సన్నిహితులందరికీ .. అనధికారికంగా టిక్కెట్లు ప్రకటించేస్తున్నారు.ఈ కారణంగా ఆయనపై ఫిర్యాదులు ఢిల్లీకి జోరుగానే వెళ్తున్నాయి. ఇక రాహుల్..నేరుగా తెలంగాణకు వస్తే ఊరుకుంటారా..?. కాంగ్రెస్‌లో చేరిన రేవంత్ రెడ్డి పరిస్థితి ఇప్పటికీ ఆగమ్యగోచరంగా ఉంది. తన బలాన్ని రాహుల్‌కు చూపించాలని రేవంత్ గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. పార్టీ నేతలందరూ… ఎవరికి వారు… రాహుల్ ముందు షో చేయడం ఖాయమే. ఇది కొత్త వివాదాలకు దారి తీయకపోతే మాత్రం పాజిటివే. ఒకవేళ తేడా వస్తే మాత్రం కాంగ్రెస్‌లో అంతే అనుకుని .. లైట్ తీసుకోవాల్సిందేనని కార్యకర్తలు ఫిక్సయిపోయారు.