రాష్ట్రాన్నే కాదు తన కుటుంబాన్ని కూడా చీలుస్తున్నారని జగన్ రెడ్డి నాలుగున్నర కోట్లు ప్రజాధనం స్పాన్సర్ షిప్ పెట్టి నిర్వహించిన ఇండియా టుడే కాంక్లేవ్ లో ముసలి కన్నీరు కార్చారు. షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు కానీ.. అంతకు ముందు ఆమె తెలంగాణలో సొంత పార్టీ పెట్టుకున్నారు. అప్పుడు ఎవరు కుటుంబాన్ని చీల్చుకున్నారు. తల్లిని పార్టీ గౌరవాధ్యక్షురాలి బాధ్యతల నుంచి బలవంతంగా తప్పించి.. పంపించేసినప్పుడు కుటుంబాన్ని ఎవరు చీల్చుకున్నారు? . కనీసం వారు వేరుగా వెళ్తున్నారని తెలిసిన తర్వాత అయినా.. తన వైపు నుంచి వారికి వచ్చిన ఇబ్బందులేమిటో తెలుసుకుని.. వారిని కూల్ చేద్దామనే ప్రయత్నాలు ఎందుకు చేయలేదు.
వారిని కలుపుకుని కుటుంబంగా ఉందామని ఎందుకు అనుకోలేదు. షర్మిల వెళ్లిపోయి తెలంగాణలో రాజకీయం చేస్తే కటుంబాన్ని తాను చీల్చుకున్నట్లుగా కాదు. కానీ ఆమె మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరి ఏపీలో రాజకీయం చేస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ తన కుటుంబాన్ని చీల్చినట్లు. జగన్ రెడ్డి తీరు చూసి కాంగ్రెస్ నేతలకు ఎలా ఉందో కానీ.. అాలాంటి కుటుంబాన్ని పెంచి పోషించినందుకు.. అడ్డగోలుగా వేల కోట్లు అక్రమ సంపాదన చేసుకునేదుకు సహకరించినందుకు కాంగ్రెస్ పార్టీకి ఈ శిక్ష పడాల్సిందేనని ఎక్కువ మంది భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ లేకపోతే వైఎస్ కుటుంబమే లేదు.
వైఎస్ ప్రమాదంలో చనిపోయే వరకూ కాంగ్రెస్ నే అంటి పెట్టుకుని ఉన్నారు. ఆయన చనిపోయిన మరుక్షణం.. కాంగ్రెస్ పైనే కుట్రలు చేశారు జగన్ రెడ్డి. ఆయనకు వేరే ఆలోచనలు లేకపోతే.. చనిపోయిన రోజు నుంచే.. ఓదార్పు యాత్ర కోసం.. శవాల లెక్క ప్రారంభించరు. ఖచ్చితంగా కాంగ్రెస్ పై కుట్ర చేసే.. ఆయన శవాల లెక్కలేసుకున్నారు. ఆ క్రమంలో సోనియాపై నిందలేశారు.. వైఎస్ ను చంపేశారని కూడా ఆరోపించారు. ఘోరమైన విమర్శలు చేశారు. చివరికి అన్న చేసిన మోసానికి బలైన షర్మిల మళ్లీ కాంగ్రెస్ లోకి వెళ్లినా.. కాంగ్రెస్ నే నిందిస్తున్నారు. ఏ చెట్టు మీద ఎదిగారో జగన్ ఆ చెట్టుపైనే నిందలు వేస్తున్నారు. ఆ చెట్టు నిందలు పడుతుంది . అలాంటి మైండ్ సెట్ ఉన్న వారిని ప్రోత్సహించినందుకు కాంగ్రెస్ పార్టీకి ఈ గతి పట్టాల్సిందేనని ఎక్కువ మంది అభిప్రాయం.