కాంగ్రెస్‌ను ఎవరూ ఓడించలేరు.. కాంగ్రెస్‌ను కాంగ్రెస్సే ఓడిస్తుందని కొంత మంది చెప్పుకుంటూ ఉంటారు. ఇతర చోట్ల సంగతేమో కానీ.. తెలంగాణలో మాత్రం అదే నిజం.
మునుగోడు ఉపఎన్నికల్లోనూ కాంగ్రెస్ చతికిలపడింది. ఏ ఉపఎన్నికల్లోనైనా కాంగ్రెస్‌కు డిపాజిట్లు తెచ్చుకోవడం గగనం అయిపోతోంది. ఒక్క నాగార్జున సాగర్ ఉపఎన్నికలో మాత్రమే కాస్త టీఆర్ఎస్కు పోటీ ఇచ్చింది. అక్కడ కాంగ్రెస్‌ను ఓడించేందుకు జానారెడ్డి లేదా ఆయన కుమారుడు బీజేపీలో చేరకపోవడం వల్లనే ఆ పరువు దక్కింది. లేకపోతే.. అది కూడా మునుగోడు, దుబ్బాక టైప్‌లోనే ఉండేది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ బలమైన శక్తి. వైఎస్ నాయకత్వానికి అందరూ అంగీకరించాక.. ఆ పార్టీ బలం బాగా పెరిగింది. కానీ హైకమాండ్ వద్ద ఎక్కువ అడ్వాంటేజ్ తీసుకున్న వైఎస్..కాంగ్రెస్ బలాన్ని తన బలంగా మార్చుకోవడంతో పతనం ప్రారంభమయింది. వైఎస్ చనిపోయిన తర్వాత రెండు రాష్ట్రాలను విడగొట్టాలని .. కాంగ్రెస్ హైకమాండ్‌ను ఎంత దారుణంగా అవమానించాలో అంత దారుణంగా అవమానించి.. ఆకరోపణలు చేసి. చివరికి వైఎస్ చనిపోవడానికి కూడా సోనియానే కారణం అని ఆరోపణలు చేసి.. ఏపీలో జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ పెట్టుకున్నారు. క్యాడర్ అంతా ఆ పార్టీ వైపు వెళ్లింది. తెలంగాణలో అయినా తిరుగులేని శక్తిగా మారుదామనుకుంటే.. ఏ మాత్రం కలసి రావడం లేదు. అంతకంతకూ బలహీనమైపోతోంది .
కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలు.. కాంగ్రెస్ గెలిస్తే.. ఫలానా నేత సీఎం అవుతాడు.. తాము ఎందుకు కష్టపడాలని ఇతర నేతలు అనుకోవడం.. గెలిచేది కాంగ్రెస్ పార్టీనే అనుకోలేని తత్వం ఆ పార్టీ నేతల్లో పెరగడంతో.. ఏ ఎన్నికలోనూ విజయం దగ్గరకు వెళ్లలేకపోయారు. దుబ్బాక, హుజూరాబాద్‌లో పరువు పోయింది. డిపాజిట్లు కూడా రాలేదు. రేవంత్ రెడ్డి ఎంత ప్రయత్నించినా.. ఆ పార్టీకి ఉన్న మౌలిక సదుపాయాల ముందు సరితూగలేదు. దీంతో మరోసారి సట్టింగ్ స్థానంలో ఘోర పరాజయమే చవి చడాల్సి వచ్చింది. ఇక్కడ పోటి చేసింది.. కాంగ్రెస్ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డినే. ఓడిపోయింది.. డిపాజిట్ కోల్పోయింది..కాంగ్రెస్‌నే. కాంగ్రెస్‌ను కాంగ్రెస్ ఓడించుకుంది. మళ్లీ నిలబడాలంటే.. కాంగ్రెస్ మరో యుద్ధం చేయాల్సిందే.