కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలని… ఆ పార్టీ నేతలు సీరియస్గా ప్రయత్నిస్తున్నారు. కొద్ది రోజులగా ఏపీలో విస్త్రతంగా పర్యటిస్తున్న ఆ పార్టీ ఏపీ ఇన్చార్జ్ ఉమెన్ చాందీ ఏ పార్టీలోనూ లేకుండా… ఖాళీగా ఉన్న బలమైన నేతలను లిస్టవుట్ చేసుకుని… వారితో చర్చలు ప్రారంభిస్తున్నారు. తను బాధ్యతలు చేపట్టిన వెంటనే.. మాజీ ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డిని.. విజయవంతంగా కాంగ్రెస్ పార్టీలోకి చేర్చగలగిన ఆయన.. ఆ తర్వాత తన ప్రయత్నాలను మరింత వేగవంతం చేశారు. రాయలసీమ నుంచే మరో కీలక నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిని కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేర్పించారు. దీంతో కాంగ్రెస్కు రాయలసీమలో కాస్తంత ఉత్సాహం వచ్చినట్లయింది.
ఇప్పుడు కోస్తాలో పర్యటనలకు ఊమెన్ చాందీ సిద్ధమయ్యారు. ఈ రోజు పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. చాందీ వెంట రఘువీరెడ్డి కూడా ఉంటారు. ఉభయగోదావరి జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ మళ్లీ పుంజుకోవాలంటే.. కొంత మంది కీలక నేతల్ని ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు.. తిరుపతి కాంగ్రెస్ నేత చింతామోహన్ తో… ముద్రగడ పద్మనాభం వద్దకు రాయబారం పంపారు. ముద్రగడకు, చింతామోహన్కు మధ్య మంచి స్నేహం ఉంది. ఈ కారణంతో..చింతామోహన్ కూడా.. వెళ్లి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ముద్రగడను కోరారు. ముద్రగడ పార్టీలోకి వస్తానంటే.. తానే స్వయంగా ఇంటికి వచ్చి పార్టీలోకి ఆహ్వానిస్తానని.. ఊమెన్ చాందీ.. కబురు పెట్టారు. కానీ ముద్రగడ మాత్రం తేల్చుకోలేకపోతున్నారు.
ముద్రగడ పద్మనాభం గతంలో కాంగ్రెస్ పార్టీలో పని చేశారు. ఎంపీగా కూడా ఎన్నికయ్యారు. తర్వాత బయటకు వచ్చారు. ముద్రగడ చాలా పార్టీలు తిరిగారు. కానీ ఎందులోనూ ఇమడలేకపోయారు. గత ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. వచ్చే ఎన్నికల్లోనూ ఆయన ఏదో ఓ ప్రధాన పార్టీ ద్వారా అదృష్టం పరీక్షించుకోవాలనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో వైసీపీకి, బీజేపీకి దగ్గరయ్యారని భావించారు. కానీ అది ఎంత దగ్గరో.. అంత దూరమని ఇటీవలి రాజకీయ పరిణామాలతో తేలిపోయింది. అయితే ఇప్పుడు వెదుక్కుంటూ.. కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం వచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీకి బలం లేదు. అందుకే ముద్రగడ.. ఏ విషయాన్ని తేల్చి చెప్పకుండా పెండింగ్లో పెట్టేశారు.