కుటుంబంలో కలతలుంటే కలిసి మాట్లాడుకుంటారు. అల్లరి చేసి ఇరుగు పొరుగు దృష్టిలో పలుచన కాకుండా కుటుంబ సభ్యులు జాగ్రత పడతారు. అలాగే దేశంలో సమస్యలుంటే అంతర్గతంగా చర్చించుకోవాలి. సామరస్యగా చర్చించుకోవాలి. లోపాలను సరిచేసుకోవాలి. విదేశాల దృష్టిలో పరువు పోయేలా ప్రవర్తిస్తే నష్టపోయేది ఆ వ్యక్తులు కాదు, దేశమే. ఈపాటి ఆలోచన కాంగ్రెస్ పార్టీ వారికి లేకుండా పోయింది. లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోయిన మరు క్షణం నుంచి బీజేపీ, ఎన్డీయేపై విషం కక్కడమే పనిగా పెట్టుకున్నారు.
కాంగ్రెస్ వారు ఔనన్నా కాదన్నా, దేశ ప్రజలు వారిని తిరస్కరించారు. అధికారంలో ఉండటానికి ప్రస్తుతానికి పనికిరారని శిలాశాసనం వంటి తీర్పుచెప్పారు. కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదాకు కూడా అవకాశం లేనంత దారుణంగా శిక్షించారు. నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీకి, ఎన్డీయేకు బ్రహ్మరథం పట్టారు. 30 ఏళ్ల తర్వాత ఒక పార్టీకి పూర్తి మెజారిటీ కట్టబెట్టారు. ఈ వాస్తవాన్ని గుర్తించడం కాంగ్రెస్ కు కష్టంగా ఉంది.
గత 18 నెలలుగా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా విఫలమవుతూనే ఉంది. ప్రజల కోసం ప్రజల కోణంలో ఆలోచించే శక్తి ఆ పార్టీకి లేదని ఇప్పటికే తేలిపోయింది. ప్రతి విషయంలోనూ మోడీ ప్రభుత్వాన్ని తిట్టడానికి పుట్టినట్టు కాంగ్రెస్ నాయకులు ప్రవర్తిస్తున్నారు. 68 ఏళ్లుగా గాడి తప్పిన దేశంలో 18 నెలల్లోనే అద్భుతాలు జరుగుతాయని భావిస్తే మూర్ఖత్వమే అవుతుంది. జరిగిన తప్పులను సరిచేయడానికి ప్రభుత్వానికి కొంత సమయం కావాల్సిందే. మోడీ ప్రభుత్వం ప్రతిదీ అద్భుతంగానే చేస్తోందని కాదు. కానీ ఒక ప్రయత్నం మొదలైంది. ఒక నమ్మకం ఏర్పడింది. అంతర్జాతీయంగా భారత్ పై విశ్వాసం ఏర్పడింది. మరిన్ని పెట్టుబడులు రావడానికి సానుకూల వాతావరణం ఏర్పడుతోంది. భారత్ శక్తి ఏమిటో ప్రపంచానికి తెలుస్తోంది. చైనా బలహీన పడిన సమయంలో, వృద్ధి రేటులో భారత్ దూసుకుపోతోంది. చైనాను కూదా అధిగమించి చరిత్ర సృష్టించింది. మరోవైపు, నల్లధనంతో సహా అనేక అంశాల్లో ప్రభుత్వం ఇంకా సఫలం కాలేదు. ప్రస్తుతానికి విఫలమైనట్టే. మరో మూడున్నరేళ్లలో ప్రభుత్వం దేశానికి ఎంత మంచి చేస్తుందో చూడాలి.
ఇలాంటి సమయంలో, దేశ ప్రతిష్టను దిగజార్చేలా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోంది. అసహనం గురించి చాలా అసహనంగా మాట్లాడుతోంది. లోక్ సభలో అసహనంపై చర్చకు పట్టుబట్టి కాంగ్రెస్ పార్టీ ఏం సాధించిందో అర్థం కాదు. సభలో ఒకరిమీద ఒకరు పైచేయి సాధించాలి కాబట్టి ఈ మధ్య జరిగిన దారుణాలే కాకుండా, అప్పుడెప్పుడో జరిగిన ఘటనలను కూడా ప్రస్తావిస్తూ ప్రసంగిస్తారు. అలా, భారత్ లో ఎప్పుడెప్పుడు ఎలాంటి దారుణాలు జరిగాయనేది మరోసారి మనకూ, ప్రపంచానికి గుర్తు చేయడం మినహా ఒరిగిందేమిటి? 1984 సిక్కుల ఊచకోత మొదలు, దాద్రీ హత్య వరకూ అనేక సంఘటనలను సభ్యులు గుర్తు చేశారు. రాహుల్ గాంధీ అయితే కొన్ని ఘటనల లిస్టు రాసుకుని ఒకదాని తర్వాత ఒకటి ఆవేశంగా చదివేశారు. అదే ఫ్లోలో తప్పులో కాలేశారు. రెండేళ్ల క్రితం జరిగిన దభోల్కర్ హత్య కూడా మోడీ ప్రభుత్వం వల్లే జరిగిందని దబాయించారు. అప్పటికి ఇంకా మోడీ ప్రభుత్వం రాలేదనే సంగతి మర్చిపోయారు.
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఎంత అసహనంగా, అపరిపక్వ నాయకుడిగా కొనసాగుతున్నారో, ఇటీవల బెంగళూరులోని యువతీ యువకులు చాటిచెప్పారు. స్వచ్ఛభారత్ ఫెయిలైందని రాహుల్ గాంధీ ఎప్పట్లాగే స్పీచ్ ఇచ్చారు. అక్కడి విద్యార్థులు ఊరుకోలేదు. నో అంటూ ముక్త కంఠంతో ఖండించారు. రాహుల్ ఆశ్చర్యపోయారు. స్వచ్ఛ భారత్ సఫలమైన కార్యక్రమం అని విద్యార్థులు నినదించారు.
ప్రజలకు మంచి చేయాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉన్నప్పుడు సూట్ బూత్ వేసుకుంటే అభ్యంతరం ఏమిటని ఓ విద్యార్థిని ప్రశ్నించింది. దీనికి జవాబు చెప్పడానికి బదులు షరామామూలుగా రాహుల్ ఓ సుదీర్ఘ లెక్చర్ ఇచ్చారు. గత 17 నెలలుగా మీ పార్టీ ప్రతిపక్ష పార్టీ బాధ్యతను పోషించడంలో విఫలమవుతోంది, పార్లమెంటును స్తంభింప చేస్తోంది ఎందుకని మరో విద్యార్థిని ప్రశ్నించింది. దీనికి కూడా ఆయన సూటిగా సమాధానం ఇవ్వలేదు. ఆ కాలేజీ విద్యార్థులు అంతటిలో ఊరుకోలేదు. రాహుల్ ఒక నాయకుడు కావాలంటే దేశం పట్ల అవగాహన, దేశం బాగుపడాలనే తపన పెంచుకోవాలంటూ కామెంట్స్ చేశారు. సోషల్ మీడియాలో పోస్టింగ్స్ చేశారు.
ప్రజలు తనను ఓడించడం కాంగ్రెస్ కు ఇప్పటికీ మింగుడు పడటం లేదు. దేశాన్ని పాలించాల్సింది తామే అనేది కాంగ్రెస్ వారి భావన. నిజానికి, కాంగ్రెస్ హయాంలో జరిగినన్ని అరాచకాలు మరే పార్టీ పాలనలోనూ జరగలేదు. కారణం, ఎక్కువ కాలం పాటు దేశాన్ని పాలించింది కాంగ్రెసే. అలాగే మంచి పనుల విషయంలోనూ కాంగ్రెస్ కు ఎక్కువగా క్రెడిట్ దక్కే అవకాశాలు కూడా ఉన్నాయి. సుదీర్ఘ కాలం పాలించింది కాబట్టి. అయితే, అసహనంపై రెండు రోజుల చర్చ వల్ల కాంగ్రెస్ ఏం సాధించిందో అర్థం కాదు. ఈ చర్చల సారాంశాన్ని విదేశీయులు గమనిస్తే, వారి దృష్టిలో దేశం పలుచనయ్యే ప్రమాదం ఉంది. దీనివల్ల పెట్టుబడులపై ప్రభావంతో సహా అనేక విధాలుగా నష్టం జరిగే ప్రమాదం ఉంది. ఇందుకేనా కాంగ్రెస్ చాలా అసహనంతో, అసహనంపై చర్చకు పట్టుబట్టింది !