తెలంగాణ రాజకీయాల వల్ల కడుపులో మంటను తగ్గించే ఈనో ప్యాకెట్లకు ప్రీ పబ్లిసిటీ వస్తోంది. ఏకంగా హోర్డింగులు పెట్టేశారు. ఈనోకు ప్రచారం చేయాలంటే అది ఉత్పత్తి చేసే కంపెనీ టీవీల్లో ప్రకటనలు, హోర్డింగులు ఇచ్చుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు తెలంగాణలో అలాంటి అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీనే ఆ బాధ్యత తీసుకుంది.
దావోస్ నుంచి రేవంత్ రెడ్డి చేసుకున్న ఎంవోయూలు అన్నీ ఫేక్ అనిబీఆర్ఎస్ ఆరోపిస్తోంది. బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో చేసిన వాటి కన్నా ఎక్కువ ఎంవోయూలు చేసుకున్నామని కడుపు మంటతో ఈ విమర్శలు చేస్తున్నారని ఈనో వాడాలంటూ కాంగ్రెస్ నేతలు ఎదురుదాడి ప్రారంభించారు. ప్రెస్మీట్లలో ఈజ్. ప్యాకేట్లు చూపించారు. తర్వాత ఈనో ప్యాకెట్లను బీఆర్ఎస్ నేతలకు పంపుతున్నట్లుగా ప్రకటనలు చేశారు. అంత వరకూ బాగానే ఉంది.. కానీ తెల్లారేసరికి హోర్డింగులు పెట్టేశారు.
హైదరాబాద్లోని చాలా చోట్ల కేటీఆర్, కేసీఆర్ కడుపు మంటతో బాధపడుతున్నట్లుగా ఫోటోలు పెట్టి ఈజ్ వాడాలంటూ హోర్డింగులు పెట్టారు. ఇందులో ఈనోను చాలా పెద్ద పెద్ద ఫోటోలు పెట్టి నిజంగానే ఈనోకు ప్రచారం చేస్తున్నట్లుగా ఉంది. ఇలాంటి పోస్టర్లు, హోర్డింగ్ వల్ల ఈనోకు ప్రచారం వస్తుంది. కానీ ఇలాంటి ప్రచారాన్ని ఆ కంపెనీ కోరుకుంటుందా లేదా అన్నది కీలకం. ఇష్టం లేకపోతే ఆ కంపెనీ కాంగ్రెస్ మీద లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు. కానీ అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి… వాడొద్దని చెప్పవచ్చు. కానీ ఇది మంచి పబ్లిసిటీ అనుకుంటే… లైట్ తీసుకుంటుంది.