బీఆర్ఎస్ దారిలోనే కాంగ్రెస్ కూడా వెళ్తున్నట్లు కనిపిస్తోంది.గతంలో ఉప ఎన్నిక జరిగే నియోజకవర్గానికి బీఆర్ఎస్ ప్రాధాన్యత ఇచ్చినట్టుగానే ప్రస్తుతం కాంగ్రెస్ కూడా అదే చేస్తుండటంతో ఆ పార్టీపై పెదవి విరుపులు మొదలయ్యాయి.
ఉప ఎన్నికలు వస్తే చాలు అధికార పార్టీ ఆ నియోజకవర్గానికి వరాల జల్లు కురిపించడం ఆనవాయితీగా వస్తోంది. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఇది పీక్స్ కు చేరుకుంది. కొత్త పథకాలకు రూపకల్పన చేసి మరీ జనాలను అట్రాక్ట్ చేశారు. దీనిపై నాడు కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉప ఎన్నిక జరిగే నియోజకవర్గానికి మాత్రమే ప్రాధాన్యత ఎలా ఇస్తారని ప్రశ్నించింది. అన్ని నియోజకవర్గాలను సమాన దృష్టితో చూడాల్సిన ప్రభుత్వం ఇతర నియోజకవర్గాలకు కోత విధించి బైపోల్ జరిగే నియోజకవర్గానికి అధిక నిధులు, పథకాలు మళ్ళించడాన్ని సవాల్ చేసింది.
అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో నెగ్గేందుకు బీఆర్ఎస్ బాటలోనే పయనిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి కంటోన్మెంట్ ప్రజలకు ఆరు వేల ఇందిరమ్మ ఇండ్లను తొలి విడతలో మంజూరు చేస్తున్నట్లు ప్రకటించడం పట్ల విస్మయం వ్యక్తం అవుతోంది. నగరంలో మిగతా నియోజకవర్గాలకు 3500 ఇందిరమ ఇండ్లను ఇస్తామని కంటోన్మెంట్ కు మాత్రం అదనంగా 2500ఎక్కువగా ఇవ్వడం వివక్ష కాదా..?అనే చర్చ జరుగుతోంది. ఇది అన్ని నియోజకవర్గాలను సమాన దృష్టితో చూడటం ఎలా అవుతుందని కాంగ్రెస్ సర్కార్ ను ప్రశ్నిస్తున్నారు.
గతంలో విమర్శలు చేసినా, హామీలు ఇచ్చినా ప్రస్తుతం కంటోన్మెంట్ ఉప ఎన్నిక గెలవడమే కాంగ్రెస్ టార్గెట్ అని.. అందుకోసమే ఆ నియోజకవర్గానికి ప్రియార్టి ఇచ్చారనే వాదనలు వినిపిస్తున్నాయి.