ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సొంత పార్టీని అవమానిస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. గతంలో ఎన్నో సార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. స్వయంగా హైకమాండ్ పైనా విమర్శలు చేశారు. అయినా షోకాజ్ నోటీసులతోనే సరి పెట్టారు. ఆ నోటీసులకు కూడా ఆయన సమాధానం ఇవ్వలేదు. చివరికి ఏ చర్యలు తీసుకోకుండానే వదిలేశారు. ఇదే అలుసైపోయింది. ఆయన అదే పనిగా పార్టీకి వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్నారు. పార్టీ పనైపోయిందని చెబుతున్నారు. బీజేపీనే ప్రత్యామ్నాయం అంటున్నారు. పార్టీ ఎమ్మెల్యే అయి ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నా ఆయనపై చర్య తీసుకోలేని నిస్సహాయ స్థితికి కాంగ్రెస్ చేరిపోయింది.
ఆయనను సస్పెండ్ చేసిన ఇప్పుడు వచ్చే నష్టమేం లేదు. ఆయనపై ఎలాగూ అనర్హతా వేటు పడదు. ఒక వేళ బీజేపీలో చేరాలనుకుంటే ఆయన రాజీనామా చేసి చేరుతారు. అప్పుడు సస్పెండ్ చేసినా ప్రయోజనం ఉండదు. ఆయన కాంగ్రెస్‌లో ఉండే ప్రసక్తే లేదని చెబుతున్నందున ఆయనపై చర్యలు తీసుకుంటే కాంగ్రెస్ పార్టీకి కాస్త గౌరవం ఉంటుందని రేవంత్ రెడ్డి వర్గం వైపు నుంచి హైకమాండ్‌కు పెద్ద ఎత్తున సూచనలు వెళ్తున్నాయి. అదే సమయంలో కోమటిెడ్డి సోదరుడు వెంకట్ రెడ్డి సోదరుడి మాటలను ఖండించలేదు.
ఆయన … సోదరుడ్ని పార్టీ నుంచి బహిష్కరించమో.. సస్పెండ్ చేయడమో చేస్తే అసంతృప్తికి గురవుతారేమోనన్న ఆందోలన కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్లుగా ఉంది. అయితే కోమటిరెడ్డి ఒక్క సారి వదిలించుకుంటే మంచిదని లేకపోతే ఆయన వల్ల పార్టీకి తీవ్ర నష్టమన్న అంచనాలు ఆ పార్టీలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ధైర్యం చేస్తారా లేకపోతే.. మొత్తం డ్యామేజ్ చేసే వరకూ వేచి చూస్తారా అన్నది ఇప్పుడు కీలకంగా మారింది.