ఆరు పార్టీల జనతా పరివార్ కూటమికి అధ్యక్షుడుగా ఉన్న సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ కాడి పక్కనపడేసి బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేయబోతున్నట్లు ప్రకటించిన తరువాత బీహార్ రాష్ట్ర రాజకీయాలలో చాలా ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. అధ్యక్షుడయిన తనకు మాట మాత్రంగా కూడా చెప్పకుండా మొత్తం 243 సీట్లలో నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ చెరో 100 సీట్లు పంచేసుకొని, కాంగ్రెస్ పార్టీకి 40 సీట్లు పంచిపెట్టేసి తనకి మొండి చెయ్యి చూపారని ములాయం వారిరువురిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తనకు, తన పార్టీకి గౌరవం లేనప్పుడు జనతా పరివార్ భారాన్ని మోయవలసిన అవసరం తనకి లేదని, బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో తన పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని ప్రకటించేశారు.
ఆయనను ప్రసన్నం చేసుకొని, మళ్ళీ జనతా కాడిని ఆయన భుజం మీద పెట్టేందుకు లాలూ, నితీష్ డిల్లీ వెళ్లి ఆయనని బుజ్జగిస్తున్నారు. కానీ ఆయన అంగీకరించడం లేదు. ఒకవేళ అంగీకరించాలంటే సమాజ్ వాదీ పార్టీకి కూడా వాళ్ళతో సమానంగా సీట్లు పంచి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అందుకు వారిరువురూ అంగీకరించడం లేదని తెలుస్తోంది. ఆయనని వెనుక నుండి బీజేపీ ఎగద్రోస్తోందని వారు అనుమానిస్తున్నారు. వారి అనుమానాలను బలపరుస్తున్నట్లున్నాయి సీనియర్ కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్ మాట్లాడిన మాటలు. “బీజేపీ, సమాజ్ వాదీ పార్టీల మధ్య రహస్య అవగాహన ఉంది కనుకనే ములాయం సింగ్ జనతా పరివార్ ని విచ్చినం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని భావిస్తున్నాము,” అని అన్నారు.
ఈసారి ఎన్నికలలో ఎలాగయినా గెలవాలని భావిస్తున్న బీజేపీకి ఆరు పార్టీలు కలిసి జనతా పరివార్ కూటమిగా ఏర్పడటం చాలా ఆందోళన కలిగిస్తోంది. అయితే ఇటువంటి పరిణామాన్ని ఊహించని కారణంగా బీహార్ రాష్ట్ర ప్రజలకి ప్రధాని నరేంద్ర మోడీ రూ.1.65లక్షల కోట్లు ఎర వేసారు. కానీ ఇప్పుడు ములాయం సింగ్ కాడి పక్కన పడేయడంతో జనతా పరివార్ ముక్కలు చెక్కలయ్యే అవకాశం ఏర్పడింది. ఊహించని ఆ అవకాశం అందిపుచ్చుకొని బీజేపీ ములాయం సింగుని వెనుక నుండి దువ్వుతున్నా ఆశ్చర్యం లేదు.
ఒకవేళ ములాయం సింగుని ప్రసన్నం చేసుకోవడం కోసం సమాజ్ వాది పార్టీకి కూడా తమతో సరి సమానంగా సీట్లు లాలూ, నితీష్ ఇవ్వాలనుకొంటే అందుకు వారు కాంగ్రెస్ పార్టీనే బలిచేసే అవకాశం ఉంది. దానికి కేటాయించిన 40 సీట్లను ములాయం చేతిలో పెడితే కాంగ్రెస్ పరిస్థితి అయోమయం అవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బీహార్ ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసే పరిస్థితి లేదు. ఒకవేళ తప్పనిసరి పోటీకి దిగినా బీజేపీ, అధికార జెడియు, ఆర్జెడి పార్టీలను డ్డీ కొని నిలబడలేదు. కనుక జనతా పరివార్ వెంటపడుతోంది. కానీ ఒకవేళ ములాయం జనతా పరివార్ కి తిరిగి వస్తే కాంగ్రెస్ పార్టీ బయటకు వెళ్ళవలసి రావచ్చును. లాలూ, నితీష్ ఇద్దరూ కలిసి ములాయం గెడ్డం పట్టుకొని బ్రతిమలాడుతుంటే, కాంగ్రెస్ పార్టీ ఆయన బీజేపీతో కుమ్మక్కు అయ్యాడని విమర్శిస్తోంది. బహుశః ఆయన తన మనసు మార్చుకొని తిరిగి జనతా పరివార్ లోకి రాకుండా అడ్డుకొనేందుకే కాంగ్రెస్ పార్టీ ఆయనపై విమర్శలు గుప్పిస్తోందని భావించవచ్చును.