హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దానం నాగేందర్‌కు పార్టీ నాయకత్వం అల్టిమేటమ్ జారీ చేసింది. పార్టీలో క్రియాశీలకంగా పనిచేయాలా, లేదా అనేది తేల్చుకోవాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆదేశించారు. రేపు జరిగే కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశంలో దీనిపై చర్చ జరగనుంది. దానం కనుక వివరణ ఇవ్వకపోతే పార్టీ నగరశాఖ అధ్యక్షపదవినుంచి తొలగించాలని నిర్ణయించారు.
నిన్న ఢిల్లీ వెళ్ళిన ఉత్తమ్, షబ్బీర్ అలీ, మల్లు భట్టి విక్రమార్క, జానారెడ్డి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్‌సింగ్‌తో భేటీ అయ్యారు. త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికలగురించి చర్చించారు. ఈ సందర్భంగా దానం నాగేందర్ వ్యవహారశైలిపై పార్టీ సీనియర్ నేతలు దిగ్విజయ్‌కు ఫిర్యాదు చేశారు. 24మంది సభ్యుల సమన్వయ కమిటీకి దానంను కన్వీనర్‌గా పార్టీ అధిష్టానం నియమించినప్పటికీ దానిపైగానీ, పార్టీ కార్యక్రమాలలోగానీ ఆయన ఆసక్తి చూపటంలేదని ఆరోపించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన దిగ్విజయ్, అతనికి ప్రత్నామ్నాయంగా వేరొక నేతను చూడాలని పీసీసీ నేతలకు సూచించారు. ఎన్నికలు రాబోతున్న ఈ కీలక సమయంలో పార్టీపై ఆసక్తిలేని వ్యక్తికోసం చూస్తూ కూర్చోవటం నష్టం కలగజేస్తుందని అన్నారు. దీనిపై ఉత్తమ్ స్పందిస్తూ, ఒకటి-రెండు రోజుల్లో దానం నాగేందర్‌తో స్వయంగా తాను మాట్లాడతానని, పార్టీలో ఉంటాడో, లేదో తెలుసుకుంటానని దిగ్విజయ్‌కు హామీ ఇచ్చారు.
దానం నాగేందర్ టీఆర్ఎస్లో చేరతారని ఇటీవల పలుసార్లు మీడియాలో వార్తలొచ్చాయి. దానం టీఆర్ఎస్ నేతలు తలసాని, పద్మారావులతో భేటీలు కావటంతో ఈ వార్తలు వ్యాపించాయి. అయితే దానం ఆ వార్తలను నాడు ఖండించారు. హైదరాబాద్ నగరంలో బలహీనంగా ఉన్న టీఆర్ఎస్, జీహెచ్ఎంసీ ఎన్నికల దృష్ట్యా, కాంగ్రెస్, టీడీపీలలో బలంగా ఉన్న నాయకులను ఎగరేసుకుపోవటానికి ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే దానంకు కూడా వల వేస్తున్నారు. మరి దానం ఆ వలలో పడతారా, లేదా అనేది చూడాలి. సిటీ కాంగ్రెస్ వ్యవహారాలలో, ముఖ్యంగా రాబోయే ఎన్నికలలో అభ్యర్థుల ఎంపిక వంటివన్నీ పూర్తిగా తనకు అప్పగిస్తే కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలని దానం యోచిస్తున్నట్లు సమాచారం.