కర్ణాటక ఓటమిని భాజపా ఏకోశానా జీర్ణించుకోలేకపోతోంది..! అధికారం దక్కకపోయేసరికి కొత్త కొత్త వాదనలను ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా తెరమీదికి తెస్తున్నారు. కాంగ్రెస్, జేడీఎస్ లు సంబరాలు జరుపుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఏం సాధించారని ఉత్సవాలు జరుపుకుంటున్నారనీ, కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ ను, జేడీఎస్ ను రెండూ మూడు స్థానాల్లో నిలబెట్టారనీ, అందుకా వీరు సంబరాలు చేసుకుంటున్నారని అక్కసు వెళ్లగక్కారు. ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఓడిపోయారనీ, మంత్రులు ఓడిపోయారనీ, చాలా చోట్ల డిపాజిట్లు కూడా కోల్పోయారనీ… అందుకేనా వారు సంబరాలు చేసుకుంటున్నారని అమిత్ షా మండిపడ్డారు.
ఈ రెండు పార్టీలు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాయో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని నియమాలనూ ఉల్లంఘించిందన్నారు. స్థానికత అంశాన్ని పదేపదే రెచ్చగొట్టారనీ, హిందూ ధర్మ విభజన కోసం ప్రయత్నించారనీ, దళితులను పక్కతోవ పట్టించేలా ప్రచారం చేశారనీ, ఎవ్వరూ ఊహించని విధంగా పెద్ద ఎత్తున ధనబలాన్ని కూడా ఉపయోగించారన్నారు. భారీ ఎత్తున సొమ్ము పంచిపెట్టి ఓట్లు కొనుగోలు చేశారని ఆరోపించారు. ఇన్ని చేసినా కూడా కాంగ్రెస్ ఓడిపోయిందనీ, ఆ ఓటమినే గెలుపు అనుకుని ఇప్పుడు సంబరాలు చేసుకుంటోందని అమిత్ షా ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, జేడీఎస్ లది ఒక అపవిత్ర కలయిక అని ఎద్దేవా చేశారు. ప్రజలు తిరస్కరించిన పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం హాస్యాస్పదం అన్నారు!
ఈ రకంగా అమిత్ షా అక్కసు వెళ్లగక్కారు..! కాంగ్రెస్, జేడీఎస్ ది అపవిత్ర బంధం అని చెప్పడం విడ్డూరంగా ఉంది. మరి, మణిపూర్ లో భాజపాది ఎలాంటి బంధం..? గోవా, మేఘాలయల్లో అధికారం కోసం భాజపా ఏర్పాటు చేసుకున్న బంధాల్లో పవిత్రత ఎంత..? తమకు అత్యధిక స్థానాలు వచ్చినంత మాత్రాన, ఇంకెవ్వరూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేకూడదన్నట్టుగా ఉన్నాయి అమిత్ షా మాటలు. ఎన్నికల్లో అన్ని నియమాలనూ కాంగ్రెస్ ఉల్లంఘించిందని అమిత్ షా అంటున్నారే… మరి, ఓ పది మంది ఎమ్మెల్యేల కొనుగోలు కోసం భాజపా నేతలు సాగించిన బేరసారాల్లో ఉన్న నీతి నియమాలు ఏపాటివి..? ఇతర పార్టీల టిక్కెట్లపై గెలిచిన నేతల్ని కూడా లాక్కునేందుకు సాగించిన ప్రయత్నంలో ప్రజాస్వామ్యబద్ధత ఎక్కడుంది..? ఒకవేళ, ఆ చీలిక రాజకీయం వర్కౌట్ అయి ఉంటే… అప్పుడు వారు ఏర్పాటు చేసే సర్కారు అత్యంత పవిత్రమైనది అని చెప్పుకుండేవారు కదా!
ఎన్నికల్లో ఓటమిని ఒప్పుకోవడం అనేది ప్రజాతీర్పునకు ఇచ్చే గౌరవం అవుతుంది. ఆ తీర్పుని అవహేళన చేయడం అనేది భాజపాకి ఒక అలవాటుగా మారిపోయింది. అధికారం దక్కకపోయేసరికి ఆ అక్కసును ఇలా వెళ్లగక్కుతున్నారని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో ఆత్మ పరిశీలన చేసుకోవాలనే ఆలోచనే భాజపాకి ఉన్నట్టుగా కనిపించడం లేదు.